‘నాడు-నేడు’ కింద కేంద్రీకృత వంట గదిని బడుల్లో ఏర్పాటు ,వీటి నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికను త్వరగా ఖరారు చేసి పూర్తి పరిశుభ్రంగా ఉండేలా వంటశాల నిర్మాణంచేపట్టాలని సీఎం జగన్ సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ బడుల్లో నాడు-నేడు(మనబడి) పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. మొదటి విడతలో చేపట్టిన పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు చూపారు. కృష్ణా జిల్లా కంకిపాడు పంచాయతీలోని కోలవెన్నులో 1938లో కట్టిన పాఠశాలను కూల్చేయాలని తల్లిదండ్రుల కమిటీ నిర్ణయించగా అలా చేయకుండానే పూర్తి రూపురేఖలు మార్చామని అధికారులు వివరించారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం రామచంద్రాపురం మండల పరిషత్ పాఠశాల, విశాఖ జిల్లా గిడిజాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిత్రాలను ప్రదర్శించారు. మొదటిదశ నాడు-నేడు పనులను సెప్టెంబర్ 5 నాటికి పూర్తిచేయాలని సీఎం సూచించారు. రెండో దశను రూ.4732 కోట్ల వ్యయంతో 14,584 పాఠశాలలు, విద్యాసంస్థల్లో అమలు చేయాలన్నారు. ‘సంబంధిత పాఠశాలలను ఆగస్టు 31లోపు గుర్తించాలి. నవంబరు 14న పనులు ప్రారంభించి జూన్ 30నాటికి పూర్తిచేయాలి. మూడోదశను 16,489 పాఠశాలలు, విద్యాసంస్థల్లో రూ.2969 కోట్లతో చేపట్టాలి. పాఠశాలలను 2021 జూన్ 30 నాటికి గుర్తించి.. 2022 మార్చి 31నాటికి పనులు పూర్తి చేయాలి.
బడులు తెరిచే రోజు అందించాలి
సెప్టెంబర్ 5న పాఠశాలలు తెరవడానికి ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ఆ రోజు ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలన్నారు. జగనన్న విద్యా కానుక ద్వారా ఇచ్చే వస్తువుల నాణ్యతలో రాజీపడొద్దని సూచించారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చే కిట్‌లోని బ్యాగ్, పుస్తకాలు, నోట్ బుక్స్, షూ, సాక్స్‌లు, యూనిఫామ్ క్లాత్‌ను పరిశీలించారు. పాఠశాలలు తెరిచే రోజు వీటిని పిల్లలకు అందించాలన్నారు. అధికారుల పనితీరును సీఎం అభినందించారు.
పరిశ్రమల అట్లాస్ రూపొందించండి
ఈనాడు, అమరావతి:‘రాష్ట్రంలోని పరిశ్రమలు, ఇండస్ట్రియల్ పార్కులను సూచిస్తూ అట్లాస్ రూపొందించాలి. ఎటువంటి పరిశ్రమలు ఎక్కడున్నాయనే వివరాలు అందులో ఉండాలి’ అని సీఎం జగన్ సూచించారు. పారిశ్రామిక ప్రమాదాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. విశాఖలో గ్యాస్‌లీకేజీని నిరోధించగలిగి ఉంటే ఆ ప్రమాదం జరిగేది కాదని, ఎవరూ పర్యవేక్షించకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. పారిశ్రామిక ప్రమాదాల్లో మరణించే వారికి రూ.50 లక్షల చొప్పున పరిహారం అందేలా పారిశ్రామిక భద్రత విధానంలో పొందుపరచాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: చారిత్రక ఘట్టం- ఆలయ నిర్మాణానికి నేడే భూమి పూజ