గాయనిగా ఉజ్జ్వల భవిష్యత్తు దిశగా తెలంగాణ మెదక్ జిల్లా నార్సింగికి చెందిన కొక్కరకుంట శర్వాణికి అడుగులు పడుతున్నాయి. ఇటీవల ట్విటర్ ద్వారా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆమె ప్రతిభపై ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌కు సూచించారు. ఈమేరకు డీఎస్‌పీ తన రాక్‌స్టార్ కార్యక్రమంలో అవకాశం ఇచ్చారు. శర్వాణి మంగళవారం రాత్రి వరకు చెన్నైలో జరిగిన దేవిశ్రీప్రసాద్ రాక్‌స్టార్ ప్రోగ్రాంలో పాటలు పాడి అలరించింది. అదే వేదికపై రాబోయే తన రెండు సినిమాల్లో పాటలు పాడేందుకు శర్వాణికి అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారని బాలగాయని తండ్రి లక్ష్మణాచారి తెలిపారు. చెన్నైలో ఆమె తెలుగు, తమిళ సినిమా పాటలు పాడింది. సంగీత దర్శకుడి మన్ననలు పొందింది.
అంతకుముందు...
స్థానిక ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్ ఇటీవలే.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌కు ట్వీట్ చేశారు. మెదక్ జిల్లా నార్సింగిలో శర్వాణి అనే బాలిక పాటను.. ఓ వ్యక్తి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. అద్భుతమైన ప్రతిభ కలిగిన ఆ అమ్మాయిని ప్రోత్సహించాలని కోరారు. వెంటనే స్పందించిన కేటీఆర్ శర్వాణి వీడియోను సంగీత దర్శకుడు... తమన్, దేవీశ్రీప్రసాద్‌లకు ట్యాగ్ చేశారు. వీడియోను వీక్షించిన దేవీశ్రీప్రసాద్.. మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
మాట నిలబెట్టుకున్న దేవీశ్రీప్రసాద్
శర్వాణి చాలా చక్కగా పాడిందని, అలాంటి ప్రతిభావంతులైన గాయకుల కోసమే తాను అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నారు. తన 'స్టార్ టు రాక్‌స్టార్' కార్యక్రమంలో శర్వాణికి తప్పకుండా అవకాశం ఇస్తానని కేటీఆర్ ట్వీట్ కు దేవీశ్రీ బదులిచ్చారు. తాను చెప్పినట్లు రాక్‌స్టార్ ప్రోగ్రామ్‌లో శర్వాణికి అవకాశమిచ్చారు డీఎస్పీ. మాట నిలబెట్టుకోవడమే కాకుండా.. శర్వాణికి తన రెండు సినిమాల్లో పాటలు పాడేందుకు అవకాశం ఇస్తున్నట్లు కూడా ప్రకటించారు. స్వచ్ఛమైన లోకల్ ట్యాలెంట్‌ను ప్రోత్సహించడమే తన కార్యక్రమ లక్ష్యమని తెలిపారు.
ఇదీ చదవండి:
పల్లె పాటకు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫిదా.. బాలికకు దేవిశ్రీ ఛాన్స్!