తెలంగాణలోని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్ట శ్రీనివాస్ నగర్లో దారుణం చోటుచేసుకుంది. జగద్గిరిగుట్ట రింగ్ బస్తీకి చెందిన నవాజ్ అనే వ్యక్తిపై ఇమ్రాన్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే అతి కిరాతకంగా పొడిచి, అక్కడి నుంచి పరారయ్యాడు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నవాజ్ మృతి చెందాడు. మృతుడు, నిందితుడు ఇద్దరూ ఆటోడ్రైవర్లని ఏసీపీ పురుషోత్తం పేర్కొన్నారు. పాత కక్షల కారణంగానే హత్య జరిగి ఉంటుందని అన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.