Palvai Sravanthi Clarity on Phone Audio: సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోన్న ఫోన్ ఆడియోపై మునుగోడు ఆశావహ అభ్యర్థి పాల్వాయి స్రవంతి స్పందించారు. కార్యకర్తకు ధైర్యం చెప్పేందుకే తానలా మాట్లాడినట్లు స్రవంతి వివరణ ఇచ్చారు. ఫోన్లో ఎవరిని కించపరించేలా మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం కూడా తనకు లేదన్నారు. చండూరులో బహిరంగ సభ విజయవంతం కావడంతో ప్రత్యర్థులు తమపై కుట్ర చేస్తున్నారని స్రవంతి ఆరోపించారు. తాను మాట్లాడిన ఆడియోను బయటపెట్టి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు చేసిన కుట్రగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. నిబద్దత కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా 30 ఏళ్ల నుంచి పార్టీలో ఉంటున్నానని పేర్కొన్నారు. మూడు సార్లు టికెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేసినట్లు తెలిపారు. ఆ కార్యకర్త పదేపదే అడగటంతో హుజూరాబాద్ అంశాన్ని ఉదాహరణగా చెప్పినట్లు పేర్కొన్నారు. పార్టీకి ఎక్కడా వ్యతిరేకంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు.
"ఆ ఆడియో మరోసారి వినండి. నేను ఎక్కడా కూడా పార్టీకి నష్టం జరిగేలా మాట్లాడలేదు. అన్ని విధాలుగా చూడాలి.. మనకు ఎందుకు అలా జరుగుతుందని చెప్తే.. గతంలో మనకు ఓ అనుభవం వచ్చింది కాబట్టి.. ఆలోచించి నాయకత్వం నిర్ణయం తీసుకుంటుది.. మీరు తొందర పడొద్దని మాత్రమే చెప్పాను. కార్యకర్త మనోవేదనకు గురికావద్దని మాట్లాడిన ఆడియోను బయటపెట్టి ఇంత వైరల్ చేస్తున్నారంటే.. దీనివెనుక ఉన్న దురుద్దేశం ఎంటో అందరికి అర్థమవుతోంది. అందరిని సంప్రదించిన తర్వాతే అధిష్ఠానం టికెట్ గురించి నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయంపై ఎవరికి ఎలాంటి అసహనం ఉండదని నేను నమ్ముతున్నా." -పాల్వాయి స్రవంతి, మునుగోడు ఆశావహ అభ్యర్థి
ఈ ఫోన్ ఆడియోపై చల్లమల్ల కృష్ణారెడ్డి సైతం స్పందించారు. పాల్వాయి స్రవంతికి టికెట్ ఇచ్చినా.. తాను పని చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు చల్లమల్ల కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తనకు టికెట్ ఖరారైనట్లు మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కార్యకర్తతో మాట్లాడిన స్రవంతి మాటల్లో ఎలాంటి తప్పిదం లేదని వెల్లడించారు. "కార్యకర్తలను కాపాడుకోవాలి.. మునుగోడులో కాంగ్రెస్ జండా ఎగురవేయాలి" అన్న లక్ష్యంతోనే తాము పని చేస్తున్నట్లు కృష్ణారెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి: