రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి సమీకరించిన భూమిలో పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు జారీ చేసిన జీవో 107ను సమర్థిస్తూ పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు గురువారం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. 'నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు' పథకం రాష్ట్రమంతటా అమలు చేస్తున్నామని అందులో భాగాంగా రాజధాని ప్రాంతానికీ వర్తింపజేస్తున్నామని వెల్లడించారు. పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో రాజకీయాలు ఆపాదించడం సరికాదన్నారు. సమీకరించిన భూమిలో 5శాతం భూమిని పేదల ఇళ్ల కోసం వినియోగించవచ్చని సీఆర్డీఏ చట్టం చెబుతోందన్నారు. పేదలకు గృహాలు కల్పించాల్సిన బాధ్యత సంక్షేమ రాజ్యంలో ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని జీవో 107ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్ని కొట్టేయాలని అభ్యర్థించారు. ఆ రైతులు నుంచి సమీకరించిన భూమిలో 1251 ఎకరాల్లో మొత్తం 54,307 మంది ప్రజలకు ఇళ్ల స్థలాల కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 25న జీవో 107ను జారీచేసింది. ఆ జీవోను సవాలు చేస్తూ కోర్టులో దాఖలైన వ్యాజ్యాల్లో ముఖ్య కార్యదర్శి ప్రమాణపత్రం దాఖలు చేశారు.
ఇదీ చదవండి
'అమరావతి భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించే అధికారం మీకెక్కడిది'