MP Vijaya sai reddy on special status : ప్రత్యేక హోదా, రుణాలకు అనుమతుల మంజూరు విషయంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌పై వివక్ష చూపొద్దని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. నిర్లక్ష్యానికి గురైన రాష్ట్రాలకు న్యాయం చేస్తామని రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ‘ప్రత్యేకహోదా గురించి సభలో మేం ప్రస్తావించడం లేదని తెదేపా, ఇతర రాజకీయపార్టీలు మమ్మల్ని విమర్శిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రధానమంత్రిని ఏడుసార్లు, హోం మంత్రిని 12సార్లకు పైగా కలిసి ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరారు. ఇటీవల హోం మంత్రి అధ్యక్షతన జరిగిన జోనల్ కౌన్సిల్ సమావేశంలోనూ ప్రత్యేకహోదా అంశాన్ని ప్రస్తావించారు. దాని కోసం మేం సాధ్యమైనంత ప్రయత్నాలు చేస్తున్నాం. గత సమావేశాల్లోనూ ఆందోళనలతో సభను స్తంభింపజేశాం. విభజన చట్టాన్ని (జైరాం రమేశ్ వైపు చూపుతూ) నిర్లక్ష్యంగా, ఎన్నో లోపాలు, తప్పులతో రూపొందించడాన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా తీసుకుంటోంది. ఏపీ విషయంలో ప్రత్యేకహోదా అంశం విభజన చట్టంలో లేకపోవడం వల్ల ఇవ్వలేమని చెప్పడం సమంజసమా? చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి .. ప్రత్యేక హోదా పోరాటాన్ని సంక్లిష్టంగా మార్చారు. ఏపీ అన్ని విధాలుగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నప్పటికీ కేంద్రం నుంచి చేయూత అందడం లేదు’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : నేడు 'జగనన్న చేదోడు పథకం' నిధులు విడుదల చేయనున్న జగన్