రాజోలిబండ మళ్లింపు పథకం.. ఆర్డీఎస్ విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయని మాజీ ఎంపీ మైసూరారెడ్డి ఆరోపించారు. సమస్య పరిష్కారం కోసం కాకుండా స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే సమస్యని తెరపైకి తెచ్చారన్నారు. ఆర్డీఎస్కు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఆమోదం తెలిపిందన్న ఆయన... నోటిఫై కావటానికి సమయం పడుతుందన్నారు.
అయితే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తీరుతో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. తెలంగాణలోనూ పాలమూరు రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల ప్రాజెక్టులకు సైతం ట్రిబ్యునల్‌లో కేటాయింపులు లేవని పేర్కొన్నారు. ఆర్డీఎస్ వల్ల రాయలసీమలో కొంతైన నీటి సమస్య తగ్గుతుందన్న ఆయన.... జగన్ సర్కారు ఇప్పటికైనా రాయలసీమ నీటి సమస్యలపై మరింత దృష్టి సారించాలని కోరారు.
"రాజోలిబండ నీటి కేటాయింపులు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యూనల్‌లో కేటాయించారు. అయితే దానికి నోటిఫికేషన్ ఇంకా రాలేదు. రాకున్నా త్వరలో కచ్చితంగా వస్తుంది. కానీ రెండు ప్రభుత్వాలు దీనిని వివాదాస్పదం చేయటం సమంజసం కాదు. వరదలు వచ్చినపుడు జలాశయాల్లో నీళ్లు నింపుకుంటున్నారు. కానీ రాయలసీమకు ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వటం లేదు. నాగార్జునసాగర్‌లో ప్రతీ ఏడాది దాదాపు 100 టీఎంసీల నీరు ఆదా అవుతుంది. ఆ నీరు కేవలం ఆంధ్రా, తెలంగాణ ప్రాంతానికే వెళ్తున్నాయి తప్ప రాయలసీమకు ఒక్క చుక్క నీరు రావట్లేదు. అంటే రెండు ప్రాంతాల మధ్య నలిగిపోయేది రాయలసీమ ప్రాంతం మాత్రమే. దానిని కూడా వివాదాస్పదం చేయడం తగదు. ఇరు ప్రభుత్వాలు రాజకీయ లబ్ధి కోసం రాయలసీమని పావుగా చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దీనిని వివాదాస్పదం చేయడం వల్ల కేవలం రాయలసీమ మాత్రమే నష్టపోతుంది. సీమ ప్రజల కోసమైనా వివాదాస్పదం చేయడం మానుకోవాలని వేడుకుంటున్నా".
- మైసూరా రెడ్డి, మాజీ ఎంపీ
ఇదీ చదవండీ.. 'వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాక్షసుడు కాదు... రక్షకుడు'