సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడిపై సినీ నటి శ్రీసుధ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఆయనపై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి చేయడంతోపాటు బెదిరించారని, తనకు ప్రాణహాని ఉందని శుక్రవారం హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అయిదేళ్లు కలిసున్న తరువాత శ్యామ్ కె.నాయుడు తనను మోసం చేశాడంటూ గత ఏడాది మే 26న శ్రీసుధ ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తాను రాజీ కుదుర్చుకున్నట్లు నకిలీ పత్రాలను సృష్టించి కోర్టులో దాఖలు చేశారని, శ్యామ్ కె.నాయుడిని ఇంత వరకు అరెస్టు చేయలేదని రెండోసారి ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో తాను సినీ ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, స్టిల్ ఫొటోగ్రాఫర్ సాయిరాం మాగంటి, శ్యామ్ కె.నాయుడిపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని, రాజీ కుదుర్చుకోవాలని బెదిరించారని తాజాగా ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ఏడాది ఆగస్టు 5న మాదాపూర్‌లోని చిన్నా నివాసానికి తనను పిలిపించి శ్యామ్ కె.నాయుడు, చిన్నా, సాయిరాం మాగంటి తదితరులు బెదిరించడంతో పాటు దూషించారని, శారీరకంగా దాడికి పాల్పడ్డారని తెలిపారు.
సినీ పరిశ్రమలో కొనసాగాలంటే తప్పనిసరిగా రాజీ కుదుర్చుకోవాలని, విషయం బయటకు చెప్పొద్దని హెచ్చరించినట్లు చెప్పారు. తాను భయంతో అప్పటి నుంచి ముందుకు రాలేదని, ప్రస్తుతం తనకు శ్యామ్ కె.నాయుడు, అతని కుటుంబ సభ్యులు, మిత్రులతో ప్రాణహాని ఉన్నందున మరోసారి ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. శ్రీసుధ తన ఫిర్యాదులో పేర్కొన్న చిన్నా నివాసం మాదాపూర్‌లో ఉండటంతో ఎస్సార్‌నగర్ పోలీసులు శ్యామ్ కె.నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, స్టిల్ ఫొటోగ్రాఫర్ సాయిరాం మాగంటి తదితరులపై జీరో ఎఫ్‌ఐఆర్ కేసు నమోదు చేశారు. కేసును మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: