Maoists Movement in Telangana: తెలంగాణలో దాదాపు ఏడాదిన్నర తర్వాత మావోయిస్టుల కదలికలు మొదలయ్యాయి. చాలాకాలం చప్పుడు లేకుండా ఉన్నా, రాష్ట్ర సరిహద్దుల్లో మరోసారి దళాల అలికిడి కలకలం సృష్టిస్తోంది. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఇటీవల పోస్టర్లు కనిపించాయి. ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో గత వారం రోజులుగా దళాలు సంచరిస్తున్నాయని పోలీసులకు సమాచారం అందింది.
తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడ్వాయి మండలం వీరాపూర్ గుట్టలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దామెరతోగు మధ్య ఉన్న అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం బలగాలు అక్కడికి చేరుకునేసరికే మావోయిస్టులు నిష్క్రమించినట్లు తెలుస్తోంది. దీంతో శుక్రవారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ త్రుటిలో తప్పినట్లయింది. మావోయిస్టులకు చెందిన వంటపాత్రలు, సోలార్ ప్యానెల్, టెంటు సామగ్రి అటవీ ప్రాంతంలో లభ్యమయ్యాయి. ఇల్లెందు-నర్సంపేట, వెంకటాపురం-వాజేడు, ఏటూరునాగారం-మహదేవ్‌పూర్ తదితర ఏరియా కమిటీలకు చెందిన పది మంది మావోయిస్టులు ఈ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
2020లో ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల అడవుల్లో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, భూపాలపల్లి జిల్లాలో కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ బృందాలు సంచరించాయి. అదే ఏడాది ఆయా జిల్లాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో సుమారు పది మంది మావోయిస్టులు మృతిచెందారు. అనంతరం రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. ప్రస్తుతం మళ్లీ మావోయిస్టుల కదలికలు చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఇవీ చదవండి..