హైదరాబాద్ భాగ్యనగరంలో ఎన్నో ప్రాంతాలున్నా.. సరైన ఆకర్షణలు లేకపోవడం వల్ల పరిమిత ప్రాంతాలనే పర్యటకులు సందర్శిస్తున్నారు.
‘వేలాడు’ వంతెనపై..
దుర్గం చెరువుపై కట్టిన వేలాడే వంతెనకు సందర్శకుల తాకిడి ఎక్కువైంది. ఇక్కడ బోటు విహారం చేసి విందులు చేసుకుంటున్నారు. ఒక్కో రోజు సందర్శకుల సంఖ్య 6 వేల వరకూ ఉంటోంది. ఇలా ఈ ఒక్క ఆకర్షణకే నగర ప్రజలు ముగ్ధులవుతున్నారు.
అవకాశం ఉన్నా..
నగరానికి మణిహారంగా ఔటర్ రింగు రోడ్డు(ఓఆర్‌ఆర్) ఉంది. దీని చుట్టూ ఎక్కడా ఆకర్షణలు లేవు. శ్రీశైలం రోడ్డులో ఓఆర్‌ఆర్‌కు చేరువగా వండర్‌ల్యాండ్ ఉండడంతో ఇక్కడకు ఎక్కువ మంది వెళ్తున్నారు. ఇది ప్రైవేటు నిర్వహణలో ఉంది. ఇక పర్యాటక రంగానికి వస్తే.. ఓఆర్‌ఆర్ చుట్టూ చర్యలు చేపట్టడం లేదు. శామీర్‌పేటలోని జింకల పార్కు, ఇక్కడే నగరానికి తాగునీటిని అందించే అతి పెద్ద సాగరాన్ని నిర్మిస్తున్నారు. ఓఆర్‌ఆర్‌కు చేరువుగా ఉన్న దూలపల్లి, చిలుకూరు వెళ్లే మార్గంలో ఉన్న సహజసిద్ధమైన ‘మృగవని జింకల పార్కు’ వంటి అడవులున్నాయి. అక్కడ విడిదితో పాటు.. సౌకర్యాలు కల్పిస్తే నగరం నుంచి అనేక మంది వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది.
స్వాగత ద్వారాలు లేక..
నగరం చుట్టూ ఎక్కడా స్వాగత ద్వారం లేకపోవడం పెద్ద లోటు. భారీ స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తే విదేశాల నుంచి వచ్చిన వారికి నగరాన్ని పరిచయం చేసినట్టయ్యేది. కనీసం బోర్డులు కూడా ఔటర్ రింగురోడ్డులో ఎక్కడా కనిపించవు.
రూ. కోట్లతో ప్రగతి..
కుతుబ్‌షాహీ టూమ్స్‌లో నాటి రాజుల సమాధులను పునరుద్ధరించే పనిలో ‘అఘాఖాన్ కల్చరల్ ట్రస్టు’ నిమగ్నమైంది. తెలంగాణ పర్యాటక శాఖ..కేంద్ర ప్రభుత్వ నిధులతో స్వదేశీ దర్శన్ పథకం కింద రూ.100 కోట్లతో ఇక్కడ సౌకర్యాలు కల్పిస్తున్నారు. పాయిగా టూమ్స్‌ను పునరుద్ధరించి ఈ రెండు ప్రాంతాలను పర్యాటకులు సందర్శించేలా చర్యలు తీసుకుంటున్నారు. వీటికి తోడు హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన, కొత్వాల గూడలోని ఎకో టూరిజం ప్రగతికి హెచ్‌ఎండీఏ చర్యలు తీసుకుంటోంది. బుద్వేల్‌లో వాటర్ వరల్డ్ సృష్టించాలని, హుస్సేన్‌సాగర్ చుట్టూ మోనో రైలు, నెక్లెస్ రోడ్డులో ‘లండన్ ఐ’ పేరిట అతి ఎత్తులోకి తీసుకెళ్లే ఎత్తైన కట్టడం నిర్మించాలని కూడా తలిచారు.
- ఇదీ చూడండి : 'భౌతిక వాదనలు పునఃప్రారంభించాలనే ఉంది.. కానీ'