తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరోజులోనే లక్షకు పైగా టీకాలు పంపిణీ జరగ్గా.. లక్షకు పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ రెండు అంశాల్లోనూ ఇంత భారీగా నిర్వహించడం ఇదే ప్రథమమని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 8న (గురువారం) రాష్ట్రంలో కరోనా సమాచారాన్ని ఆయన శుక్రవారం విడుదల చేశారు. తాజా ఫలితాల ప్రకారం.. గురువారం ఒక్కరోజే 1,01,986 నమూనాలను పరీక్షించారు. వీటిలో 89,645 నమూనాలను ప్రభుత్వ వైద్యంలో, 12,341 పరీక్షలను ప్రైవేటు ల్యాబుల్లో పరీక్షించారు. ఇందులో 48.5 శాతం పరీక్షలు ప్రైమరీ కాంటాక్టు వ్యక్తుల్లో నిర్వహించగా.. 12.6 శాతం పరీక్షలను సెకండరీ కాంటాక్టు వ్యక్తుల్లో నిర్వహించడం విశేషం.
3.21 లక్షలకు పెరిగిన బాధితులు
తెలంగాణలో కొత్తగా 2,478 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ఒక్కరోజులో నిర్ధారించిన కేసుల్లో ఇదే అత్యధికం. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తంగా బాధితుల సంఖ్య 3,21,182కు పెరిగింది. మహమ్మారితో మరో 5 మరణాలు సంభవించగా, ఇప్పటివరకూ 1,746 మంది కరోనాతో కన్నుమూశారు.
100 దాటిన జిల్లాలు 6
తెలంగాణలో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీలో గత వారం రోజుల్లో దాదాపు 80 శాతానికి పైగా కేసులు పెరిగాయి. ఈనెల 2న ఇక్కడ 283 కేసులు నమోదు కాగా, తాజాగా గురువారం 402 నిర్ధారణయ్యాయి. జగిత్యాల (105), మేడ్చల్ మల్కాజిగిరి (208), నిర్మల్ (111), నిజామాబాద్ (176), రంగారెడ్డి (162) జిల్లాల్లో ఒక్కరోజులో 100కి పైగా కొత్త పాజిటివ్‌లు నమోదవడం గమనార్హం. ఆదిలాబాద్ (72), కామారెడ్డి (98), కరీంనగర్ (87), ఖమ్మం (54), కుమురంభీం ఆసిఫాబాద్ (67), మహబూబ్‌నగర్ (96), మంచిర్యాల (85), నల్గొండ (88), రాజన్న సిరిసిల్ల (61), సంగారెడ్డి (79), సిద్దిపేట (54), వికారాబాద్ (55), వరంగల్ నగర (82) జిల్లాల్లోనూ కరోనా వైరస్ ఉద్ధృతంగానే ఉంది. మిగిలిన జిల్లాల్లో ఒక్కరోజులో కొత్త కేసులు 50 కంటే తక్కువగా నమోదయ్యాయి.
టీకాలకు బారులుతీరిన ప్రజలు
తెలంగాణలో గురువారం ఒక్కరోజే 1,02,886 కొవిడ్ డోసులను వైద్య ఆరోగ్యశాఖ పంపిణీ చేసింది. ప్రభుత్వ వైద్యంలో 935 పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి, వీటిలో 80,722 టీకాలను అందించగా, ప్రైవేటులో 258 కేంద్రాల్లో 20,889 డోసులను పంపిణీ చేశారు. చాలా కేంద్రాల్లో టీకాలు పొందడానికి ప్రజలు బారులుదీరారు. ఎండను కూడా లెక్కచేయకుండా వరుసల్లో నిలబడి మరీ టీకాలు వేయించుకున్నారు. ఇందులో తొలిడోసు 96,385 కాగా, రెండోడోసు 6,501గా నమోదైనట్లు వైద్యశాఖ తెలిపింది. తాజాగా తొలిడోసు టీకాలు తీసుకున్నవారిలో 45 ఏళ్ల పైబడినవారు 95,871 మంది. మొత్తంగా తొలి, రెండో డోసులు కలుపుకొని ఇప్పటి వరకూ రాష్ట్రంలో 17,83,208 డోసులు పంపిణీ జరిగినట్లు వైద్యశాఖ వెల్లడించింది.
మాస్కుతో వైరస్‌కు లాక్‌డౌన్: డీహెచ్
తెలంగాణలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోందనీ, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యంలో 1064 కేంద్రాల్లో యాంటీజెన్ పరీక్షలను, 20 కేంద్రాల్లో ఆర్‌టీపీసీఆర్ పరీక్షలను నిర్వహిస్తున్నామనీ, ఎటువంటి లక్షణాలు కనిపించినా వెంటనే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. ఇళ్ల వద్ద ఐసొలేషన్ సేవలు పొందలేనివారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 46 కేంద్రాల్లో 4,333 పడకలను సిద్ధం చేశామనీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కొవిడ్ చికిత్సలకు 8,559 పడకలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:
ఎడ్లబండిని ఢీకొన్న టిప్పర్.. ఇద్దరు మృతి.. మరో నలుగురికి తీవ్రగాయాలు