2000 ఆగస్టులో భారీ వర్షాల వల్ల హైదరాబాద్ నగరం అల్లాడిపోయింది. ఆకస్మిక వరదకు కారణాలు, పరిష్కారాలపై కిర్లోస్కర్ కన్సల్టెన్సీ సమగ్రంగా అధ్యయనం చేసి పలు సిఫార్సులు చేసింది.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ సంస్థ హైదరాబాద్‌కు కీలకమైన హిమాయత్‌సాగర్, ఉందాసాగర్, మీరాలం చెరువులు, వాటి పరీవాహకంలోని నీటివనరులు 1978లో ఎలా ఉన్నాయో, 2017 నాటికి ఎలా ధ్వంసమయ్యాయో అధ్యయనం చేసి 2017లో నివేదిక ఇచ్చింది.
ఈ ఏడాది భారీ వర్షాలకు నగరం తీవ్రంగా నష్టపోవడంతో నీటిపారుదల శాఖ 15 బృందాలతో 192 చెరువులు, కుంటలను పరిశీలించింది. అన్నీ ఆక్రమణలపాలయ్యాయని, తూములు, అలుగులు ధ్వంసమయ్యాయని, చెరువుల్లోకి నీరొచ్చేమార్గం, బయటకు వెళ్లే మార్గాల నామరూపాల్లేవని తేల్చింది.
కీలకమైన ఈ మూడు నివేదికల్లోనూ దాదాపుగా సారాంశం ఒక్కటే. చెరువులు, కుంటలు, జలవనరుల్ని దారుణంగా ధ్వంసం చేశారు. ఫలితంగానే నగరాన్ని వరదలు చుట్టుముడుతున్నాయి.
హిమాయత్‌సాగర్ బేసిన్: సగానికి సగం చెరువులు మాయం
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ నివేదిక ప్రకారం హిమాయత్‌సాగర్ 41.22 శాతం నీటి విస్తరణ ప్రాంతాన్ని కోల్పోతే, ఉందాసాగర్ 43.37 శాతం, మీరాలం చెరువు 20.55 శాతాన్ని కోల్పోయాయి. హిమాయత్‌సాగర్‌లో 19 రకాలు, మీరాలంలో 17 రకాలు, ఉందాసాగర్‌లో 16 రకాల ఆక్రమణలు జరిగాయి. హిమాయత్‌సాగర్ బేసిన్ పరిధిలోని చెరువులు, కుంటల పరిస్థితి దారుణం. చెరువుల విస్తీర్ణం 2,081.83 హెక్టార్ల నుంచి 1,223.238 హెక్టార్లకు తగ్గిపోయింది. నగరానికి తాగు నీరందించే ఈ జలాశయం పరివాహక ప్రాంతంలోని 108.27 చ.కి.మీ. విస్తీర్ణంలో 23 చెరువులు, కుంటలు ఉండేవి. ఇప్పుడు వాటిలో సగానికి పైగా అదృశ్యమయ్యాయి. 1978-2017 సంవత్సరాల మధ్య 857.857 హెక్టార్ల విస్తీర్ణం ఉన్న నీటి వనరులు కనిపించకుండాపోయాయి.
ఒక చెరువులో ఎఫ్‌టీఎల్ ఏరియాలో ఏకంగా బోరు, కచ్చారోడ్లు వేశారు. ప్రభుత్వం ఎఫ్‌టీఎల్ పరిధిని మరింత తగ్గించిందని నివేదిక పేర్కొంది. చెరువుల్లో ఫాంహౌస్‌ల నిర్మాణం, మురుగునీటిని వదలడం, చెత్త, వ్యర్థాలు వేయడం గురించి కూడా వెల్లడించింది. హిమాయత్‌సాగర్‌లోకి నీళ్లొచ్చే రెండు కాలువలను బ్లాక్ చేశారు. మురుగునీటిని నేరుగా ఇందులోకి వదలడం మరింత ఆందోళనకరమని పేర్కొంది. కొన్ని చెరువుల్లో డంపింగ్‌యార్డులు, రబ్బర్ ఫ్యాక్టరీ, శ్మశానాలు ఇలా అనేకం వెలిసినట్లు తెలిపింది.
‘హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతంలోని బండ్లగూడ, బ్రహ్మచెరువు, సంపత్‌నగర్ కుంట, రాజేంద్రనగర్ చెరువు పూర్తిగా అదృశ్యమయ్యాయి. చీరాబాయి బౌలి, డెయిరీఫాం, దివాన్‌గూడ, హెరిటేజ్, లంగర్‌గూడ, ఎన్.ఐ.ఆర్.డి చెరువు, పాశంబండ చెరువు, సికిందర్ చెరువు అంతర్ధానానికి దగ్గరలో ఉన్నాయి.’
అన్నీ ఆక్రమణలమయమే..
ఈ ఏడాది అక్టోబరులో భారీ వర్షాలకు నగరం నీట మునిగిన నేపథ్యంలో చెరువులు, కుంటల పరిస్థితిని అధ్యయనం చేసేందుకు నీటిపారుదల శాఖ ఇంజినీర్ల నేతృత్వంలో 15 బృందాలను ఏర్పాటు చేసింది. వారు 192 చెరువులు, కుంటలను పరిశీలించారు. వాటిలో సగానికిపైగా ఆక్రమణలకు గురయ్యాయని, రెండు చెరువులు అసలు కనిపించడంలేదని వారు నివేదించారు. తాము పరిశీలనకు వెళ్లినపుడు కూడా మట్టిపోసి చెరువులో కొంతభాగాన్ని చదును చేస్తున్నారని ఓ బృందం నివేదించింది. నిత్యం అధికారులు పర్యటించే ప్రాంతాల్లో కూడా ఆక్రమణలు యథేచ్చగా జరిగినట్లు ఈ నివేదికలను బట్టి స్పష్టమవుతుంది.
సరూర్‌నగర్ చెరువు కాలువ మొత్తం ఆక్రమణలకు గురికాగా, బండ్లగూడలోని గుర్రంచెరువు ఎఫ్.టి.ఎల్. పరిధిలో ఆక్రమణలున్నాయని నివేదించారు. కొన్నిచోట్ల ప్రభుత్వ సంస్థలు కూడా ఆక్రమించాయి. దుర్గంచెరువు ఎఫ్.టి.ఎల్. పరిధిలో 35 ఎకరాల్లో నివాస, వాణిజ్య భవనాలు వచ్చాయి. బుర్హాన్‌ఖాన్ చెరువు, చందం చెరువు, ఖాజాగూడ, బక్షికుంట, నాయనమ్మకుంట, సాకిచెరువు, తీగల్‌సాగర్ చెరువు, తిమ్మక్కచెరువు, రాయసముద్రం చెరువు వంటివెన్నో ఆక్రమణల్లో ఉన్నాయి. ఉప్పల్, హయత్‌నగర్, కాప్రా, మూసాపేట తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి.
మీరాలం బేసిన్: 21కి మిగిలినవి 8
మీరాలం చెరువు పరీవాహక ప్రాంతంలో 21 చెరువులు, కుంటలకు గానూ 8 మాత్రమే మిగిలాయి. ముష్క్‌మహల్ లేక్, గురునానక్ గ్రౌండ్ లేక్, తీగల్‌కుంట, నవాబ్‌సాబ్‌కుంట-1, నవాబ్‌సాబ్‌కుంట-2, ఉప్పరపల్లె లేక్, శాస్త్రీపురం, జలాల్‌బాబానగర్ కుంట, ముస్తాఫానగర్ కుంట అదృశ్యం కాగా, ఊరచెరువు ఆ దిశలో పయనిస్తోంది. మొత్తం విస్తీర్ణం 206.93 హెక్టార్లు కాగా, ప్రస్తుతం 164 హెక్టార్లు మిగిలింది. ఆక్రమణలు, పారిశ్రామిక, వ్యర్థాలు వేయడం, నిర్వహణ లేకపోవడం ఈ దుస్థితికి కారణమని నివేదిక వెల్లడించింది.
ఉందాసాగర్ బేసిన్..
ఉందాసాగర్ బేసిన్ పరిస్థితి మరీ దయనీయం. ఇక్కడ 1978 సర్వే ఆఫ్ ఇండియా టోపోసీట్స్ ప్రకారం 27 చెరువులు, కుంటలు ఉంటే 2012 నాటికి తొమ్మిదే మిగిలాయి. సరూర్‌నగర్ ప్రాంతంలోనే అత్యధికంగా 15 కనుమరుగయ్యాయి. సరూర్‌నగర్‌లోని పెద్దచెరువు 1978లో 20.59 హెక్టార్లు ఉంటే 2017 నాటికి 0.91 హెక్టార్లు మిగిలింది. 8.777 హెక్టార్లుండే హైదరాబాద్‌లోని సుర్మచెరువు ఆనవాళ్లు లేకుండాపోయింది. 27.54 హెక్టార్లు ఉండాల్సిన గుర్రం చెరువు 14.55 హెక్టార్లకు పరిమితమైనా దీని పరిస్థితి మెరుగ్గానే ఉందని నివేదిక పేర్కొంది. ఈ బేసిన్‌లో మొత్తం నీటి వనరుల విస్తీర్ణం 236.02 హెక్టార్లు కాగా, 2017 నాటికి 133.65 హెక్టార్లకు మిగిలింది.
అమలు కాని కిర్లోస్కర్ కమిటీ సిఫార్సులు
2000 ఆగస్టు 23, 24 తేదీల్లో హైదరాబాద్ నగరంలో 240 మి.మీ. వర్షపాతం నమోదైంది. అనేక కాలనీలు నీట మునిగాయి. వేలమంది నిరాశ్రయులయ్యారు. ఇలాంటి పరిస్థితి తలెత్తడానికి గల కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై ‘కిర్లోస్కర్ కన్సల్టెంట్స్’ అధ్యయనం చేసి నివేదిక సమర్పించింది. ముఖ్యమైన 28 డ్రెయిన్లతోపాటు ద్వితీయ, సరిహద్దు ప్రాంతాల్లోని మొత్తం 72 డ్రెయిన్లపై అధ్యయనం చేసింది. నగరంలో 18 ప్రధాన జలాశయాలు ఉండగా, అత్యంత ప్రాధాన్యం గల హుస్సేన్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, మీరాలం ట్యాంకు గురించి వివరంగా అధ్యయనం చేసింది. హుస్సేన్‌సాగర్ నుంచి మిగులు జలాలు తరలించే నాలా గోడలు కూలిపోగా, చాలా ప్రాంతాల్లో అనేక నాలాలు ధ్వంసమయ్యాయి. ఇందుకు గల కారణాలను కిర్లోస్కర్ కన్సల్టెన్సీ నివేదిక పేర్కొంది.
గంటకు 12 మి.మీ. వర్షపాతాన్ని లెక్కలోకి తీసుకొని డ్రెయిన్లను నిర్మించారు. చెరువులు తెగిపోవడం వల్ల వరద పోటెత్తడం.. వరద నీటిని నిల్వ చేయాల్సిన చాలా చెరువులు అదృశ్యం కావడం, వ్యర్థపదార్థాలు, చెత్తను నాలాల్లో వేయడం, నీటి ప్రవాహ మార్గాలను ఆక్రమించుకోవడం, నీటి ప్రవాహమార్గాల్లో పట్టాభూములు.. చెరువుల వెనకభాగంలో హౌసింగ్ కాలనీలు రావడం, సర్వీసు లైన్లు ఎలాపడితే అలా వేయడం, రోడ్ల పక్కనే బిల్డింగ్ మెటీరియల్ వేయడం వల్ల డ్రెయిన్లు పూడిపోవడం, నీటి ప్రవాహ మార్గాలను మళ్లించడం మొదలైనవి ఇందుకు కారణాలుగా పేర్కొంది. హుస్సేన్‌సాగర్ పరీవాహక ప్రాంతంలో కీలకమైన కూకట్‌పల్లి నాలాతో సహా జోన్లవారీగా ఉన్న నాలాలపై ఆక్రమణల గురించి నివేదిక వివరంగా పేర్కొంది.
ప్రధాన సిఫార్సులివీ..
- ప్రధాన డ్రెయిన్‌కు ఇరువైపులా 10 నుంచి 20 మీటర్లు అభివృద్ధి చేయని జోన్/ గ్రీన్‌జోన్‌గా రిజర్వ్ చేయాలి. ఇప్పటివరకు గట్లు ఆక్రమణకు గురి కాని
- డ్రెయిన్లను గుర్తించి ఈ పని చేయాలి.
- చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలు నాలాల్లో వేయడం వల్ల ప్రవాహం సాఫీగా సాగడంలేదు.
- నీటి ప్రవాహమార్గాలకు అడ్డులేకుండా చూడాలి.
- డ్రెయినేజీ వ్యవస్థను ఆధునికీకరించాలి.
- చెరువులకు నష్టం కలిగించే ఏ చర్యకూ అనుమతించకూడదు. చెరువుల్లో పూడిక తొలగించి వాటి సామర్థ్యాన్ని పెంచాలి.
- మూసీ ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలి. నది లోతు కొంత పెంచాలి.
- ఏడాది పొడవునా డ్రెయిన్ వ్యవస్థను పర్యవేక్షించడానికి నగరపాలక సంస్థ, జలమండలి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేయాలి.
ఇవీ చూడండి: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు