తెలంగాణ పూల పండుగ బతుకమ్మ గొప్పతనాన్ని విశ్వవేదికపై చాటేందుకు(Bathukamma on burj Khalifa) రంగం సిద్దమైంది. దుబాయ్ బుర్జ్ ఖలీఫాపై ఇవాళ రాత్రి బతుకమ్మ ప్రదర్శన(Bathukamma on burj Khalifa) జరగనుంది. రాత్రి 9.40 గంటలు, మళ్లీ రాత్రి 10.40 గంటలకు బతుకమ్మ వీడియో ప్రదర్శించనున్నారు. ఈ వేడుక కోసం ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత దుబాయ్ చేరుకున్నారు. కవిత వెంట ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, గణేశ్ గుప్తా, సురేందర్, షకీల్, జీవన్‌రెడ్డి, సంజయ్, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి ఉన్నారు. కవిత బృందానికి ప్రవాస తెలంగాణవాసులు, తెరాస నేతలు ఘనస్వాగతం పలికారు.
ఒకేసారి లక్షమంది..
బతుకమ్మ ఘనతను విశ్వవేదికగా చాటేందుకు బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ప్రాశస్త్యం, విశిష్ఠత, సంబురాల సంస్కృతిని తెలిపేలా వీడియో ప్రదర్శించనున్నారు. బతుకమ్మతో పాటు సీఎం కేసీఆర్ చిత్రపటం ప్రదర్శించనున్నారు. ఒకేసారి లక్ష మంది వీక్షించేలా భారీ తెర ఏర్పాటు చేశారు. తెలంగాణ పూల పండుగ బతుకమ్మ గొప్పతనాన్ని విశ్వ వేదికపై చాటేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నేడు దుబాయ్‌లోని ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ(Bathukamma on burj Khalifa)ను ప్రదర్శించనున్నారు. బతుకమ్మ వీడియోను ప్రదర్శించబోయే తెర ప్రపంచంలోనే అతి పెద్దది కావటం గమనార్హం.
బతుకమ్మ ఖ్యాతి
రాత్రి 9 గంటల 40 నిమిషాలకు.. మళ్లీ 10 గంటల 40 నిమిషాలకు రెండు సార్లు బుర్జ్ ఖలీఫా మీద బతుకమ్మ వీడియో ప్రదర్శిస్తారు. మూడు నిమిషాల నిడివి గల వీడియోలో.. తెలంగాణ బతుకమ్మ ప్రాశస్త్యం, విశిష్టత, సంబురాల సంస్కృతిని తెలియజేస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని కూడా మొత్తం సౌధంపై ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమం కోసం కవిత ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు. బతుకమ్మ ఖ్యాతిని ప్రపంచమంతటా చాటిచెప్పేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్టు కవిత వివరించారు. దేశ విదేశాలకు చెందిన సుమారు లక్ష మంది ఒకేసారి బతుకమ్మను వీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, తెలంగాణ జాగృతి నాయకులు, ప్రవాస తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు సైతం ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.