రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని.. వైకాపాను లక్ష్యంగా చేసుకుని, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఆయన వ్యవహరించడం దుర్మార్గమని శాసనసభ సభాహక్కుల సంఘం ఛైర్మన్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నిమ్మగడ్డ చర్యలతో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతోందన్నారు. కాకాణి ఆదివారం నెల్లూరులో మాట్లాడారు. ‘హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా తెదేపాకు అనుకూలంగా వ్యవహరించాలనే నిమ్మగడ్డ ఆలోచిస్తుండటం దురదృష్టకరం. ఎస్‌ఈసీ మితిమీరిన జోక్యంపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు ఇచ్చిన నోటీసులను విచారణకు స్వీకరించాం. దీనిపై తప్పనిసరిగా విచారణ చేపడతాం. వాస్తవాలు బయటకు తీసిన తర్వాత ఎన్నికల కమిషనర్ చర్యలు, ఆయన వ్యాఖ్యలు, ప్రవర్తనపై చర్యలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. శాసనసభ రాజ్యాంగ వ్యవస్థ. అది కోర్టుల పరిధిలోకి రాదు. శాసనసభగానీ, సభాహక్కుల సంఘం తీసుకునే నిర్ణయాన్ని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కోర్టుల్లో కూడా సవాల్ చేయలేరు. ఎన్నికలకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులను నాటి లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ తోసిపుచ్చారు. రాజ్యాంగ వ్యవస్థ.. రాజ్యాంగానికి మూలస్తంభమైన శాసనసభ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే’ అని అన్నారు.
ఇదీ చదవండి