పాఠశాలకు వెళ్తున్నామని చెప్పి... అదృశ్యమైన ముగ్గురు విద్యార్థుల ఆచూకీ లభ్యమైంది. తెలంగాణలోని పటాన్‌చెరు పెద్ద మార్కెట్ వద్ద విద్యార్థులు ఉండగా.. వారిని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. పాఠశాలకు వెళ్తున్నామని చెప్పిన విద్యార్థులు పటాన్‌చెరు గౌతమ్‌నగర్ కాలనీలో శుక్రవారం ఉదయం అదృశ్యమయ్యారు. సాయంత్రమైనా పిల్లలు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏం జరిగింది?
బిహార్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు అదృశ్యం కావడంతో తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో కలకలం రేగింది. పటాన్‌చెరు గౌతమ్ నగర్ కాలనీలో బిహార్ రాష్ట్రానికి చెందిన మూడు కుటుంబాలు ఉంటున్నాయి. రాహుల్, విక్రమ్, ప్రీతం అనే ముగ్గురు విద్యార్థులు శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి వెళ్లారు. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. ఎక్కడా వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో శుక్రవారం అర్ధరాత్రి దాటాక విద్యార్థుల కుటుంబసభ్యులు... పోలీసులను ఆశ్రయించారు.
ముమ్మర గాలింపు
అప్రమత్తమైన పోలీసులు... పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి విద్యార్థుల కోసం వెతికారు. కాగా పెద్ద మార్కెట్ వెనక భాగంలో ముగ్గురు పిల్లలు ఉండటాన్ని గమనించారు. వారిని పట్టుకొని... తల్లిదండ్రులకు అప్పగించారు. పిల్లలు క్షేమంగా ఇంటికి రావడంతో వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: Request for protection: 'ఎంపీ సురేష్ నుంచి రక్షణ కల్పించండి'..ఎస్పీకి వినతిపత్రం