గ్రామ, వార్డు సచివాయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేస్తామని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 20 నుంచి 26 వరకు పరీక్షలు జరిపేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఖాళీగా ఉన్న 16 వేల 208 ఉద్యోగాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల 56 వేల 931మంది దరఖాస్తు చేసుకున్నారని, 19 రకాల పోస్టులకు గాను 14 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షలను సమర్థంగా నిర్వహించేందుకు అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 20న తొలి రోజునే 6 లక్షల 81వేల 664మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నారని, అభ్యర్థులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రతిభావంతులకే ఉద్యోగాలు
అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలని తెలిపారు. కొవిడ్ దృష్ట్యా భౌతిక దూరం పాటిస్తూ 14 నుంచి 16 మంది అభ్యర్థులకు ఒక గది చొప్పున ఏర్పాటు చేశామని.. కరోనా ఉన్న అభ్యర్థులకు ప్రత్యేక పరీక్ష గదిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీని అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారని మంత్రి బొత్స తెలిపారు. పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన... ప్రతిభావంతులకే ఉద్యోగాలు వస్తాయన్నారు. దళారులు, మధ్యవర్తుల మాటలు నమ్మి విద్యార్థులు, తల్లిదండ్రులు మోసపోవద్దని మంత్రి సూచించారు.
మన్యంలో 18 కేంద్రాలు
విశాఖ మన్యంలో సచివాలయ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పాడేరు ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్ తెలిపారు. విశాఖ జిల్లా అరకు లోయ మండలంలో ఆయన పర్యటించి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. కొవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని... నిర్వాహకులను ఆదేశించారు. పాజిటివ్ అభ్యర్థులకు వేరే గదులను కేటాయిస్తున్నామన్నారు. మన్యంలో 18 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం గిరిజన మ్యూజియంలో జరుగుతున్న ఆధునికీకరణ పనులను ఆయన పరిశీలించారు.
ఇదీ చదవండి : విశాఖపట్నం పోర్టు అభివృద్ధికి రూ.4 వేల 65 కోట్లు