విగ్రహాల ధ్వంసాన్ని ఆధారాలతో సహా డీజీపీ గౌతమ్ సవాంగ్ బయటపెట్టారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. డీజీపీ చెప్పినవన్నీ వాస్తవాలేనని స్పష్టం చేశారు. తెదేపా, భాజపా నేతలు డీజీపీని లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. భాజపాకు భయపడేందుకు మాది తెదేపా ప్రభుత్వం కాదని వ్యాఖ్యానించారు. భాజపా నేతలు అవసరమైతే కేంద్రానికి ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు.
విచారణ ఎందుకు ప్రారంభించలేదు..?
తిరుపతి ఉపఎన్నికలో లబ్ధి కోసమే భాజపా ప్రయత్నం చేస్తోందని మంత్రి వెల్లంపల్లి ఆరోపించారు. సామాజిక మాధ్యమాల ద్వారా దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తెదేపా పాలనలో గుళ్లు కూల్చినప్పుడు వీర్రాజు, మాధవ్ ఏమయ్యారని...? ప్రశ్నించారు. మతవిద్వేషాలు రెచ్చగొడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించామని గుర్తు చేశారు. సీబీఐకి అప్పగించి 4 నెలలైనా ఎందుకు విచారణ ప్రారంభించలేదని నిలదీశారు.
'ఆలయాలపై నిజాలు బయటపెట్టినప్పటి నుంచి తెదేపా, భాజపా నేతలకు భయం పట్టుకుంది. బాధ్యత గల పార్టీలు సంబంధం లేదని చెప్పాలి కానీ... చంద్రబాబు, సోము వీర్రాజు, మాధవ్... డీజీపీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పోలీసు అధికారులను బెదిరించేలా సోము వీర్రాజు లేఖ రాశారు. మీరు బెదిరిస్తే భయపడటానికి ఇది తెదేపా ప్రభుత్వం కాదు.... వైకాపా ప్రభుత్వం. ఎవరికీ భయపడే ప్రభుత్వం తమది కాదు. అవసరమైతే కేంద్రానికి ఫిర్యాదు చేసుకోండి. మత విద్వేషాలు రెచ్చగొడితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం' - వెల్లంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి