రాష్ట్రంలో ఏడాదికి ఇసుకపై వచ్చే ఆదాయమే 950 కోట్లయితే ఇందులో వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందో తెదేపా నేతలు సమాధానం చెప్పాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ‘రాష్ట్రంలో ఏడాదికి 2కోట్ల టన్నుల ఇసుకను జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్(జేపీ) సరఫరా చేయాల్సి ఉంటుంది. టన్నుకు రూ.450 చొప్పున ఆ సంస్థ ఆర్జించే మొత్తం ఆదాయం సుమారు రూ.950కోట్లు. ఇందులో ప్రభుత్వానికి వచ్చేది రూ.765కోట్లు. మిగిలిన మొత్తం నిర్వహణ ఖర్చుల కోసం ఆ సంస్థకు వెళుతుంది’అని మంత్రి తెలిపారు.
‘నైపుణ్యం, సమర్థత, అనుభవం ఉన్న సంస్థలు మాత్రమే పాల్గొనేలా ఇసుక టెండర్ బిడ్ సెక్యూరిటీగా రూ.120కోట్ల మొత్తాన్ని నిర్ణయించాం. కేంద్రప్రభుత్వ రంగ సంస్థ టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి జేపీ సంస్థను ఎంపిక చేసింది. జేపీ సంస్థ దివాలా తీసి ఉంటే రూ.120కోట్ల సెక్యూరిటీ మొత్తాన్ని ఎలా చెల్లిస్తుంది? తెదేపా నేతలు గత ఐదేళ్లూ ఇసుకను దోచేశారు. సామాన్యులు వారు తెచ్చుకునే వాహనాలతోనే రీచ్‌లకు వెళ్లి వారికి నచ్చిన ఇసుకను తీసుకువెళ్లేలా ఏర్పాటు చేశాం.
ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఎక్కువ ధరకు ఇసుకను విక్రయిస్తే ఫిర్యాదు చేసేందుకు 14500టోల్ ఫ్రీ నంబరు అందుబాటులో ఉంచాం. ప్రభుత్వం పేదలకు కట్టించనున్న ఇళ్లకు, సాగునీటి ప్రాజెక్టుల ముంపు బాధితులకు పునరావాస చర్యల కింద చేపట్టే నిర్మాణాలకు ఇసుకను కాంట్రాక్టు సంస్థ ఉచితంగానే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది’అని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు.
ఇదీ చూడండి. ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీబీఐ కేసు