ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకు టోకన్లు ఇచ్చి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నదీ తీరంలో రీచ్లకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో అవసరమైన వారికి ఉచితంగా ఇసుక అందిస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల కంటే తక్కువగా టన్నుకు 475 రూపాయల చొప్పున ఇసుకను అందరికీ ఇస్తున్నామన్నారు. పారదర్శకత, నాణ్యత కోసమే ప్రైవేటు సంస్థలకు ఇసుక సరఫరాను అప్పగించామని స్పష్టం చేశారు. నూతన విధానంలో ఎపీఎండీసీ ద్వారా ఇసుకను ఇప్పటివరకు పంపిణీ చేస్తుండగా..లోపాలను గుర్తించి సరిదిద్దుతూ నూతన విధానం ప్రవేశపెట్టామని పేర్కొన్నారు.
నాణ్యంగా సరఫరా చేయగలిగే ప్రైవేటు సంస్థలకు ఇసుక సరఫరా అప్పగించామన్నారు. ఇసుక సరఫరాలో లోపాలుంటే ఎస్ఈబీకి, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. తెదేపా హయాంలో ఇసుక దోపిడీకి గురైందని, వేలకోట్ల ఇసుకను తెదేపా నేతలు అడ్డగోలుగా దోచుకు తిన్నారని ఆరోపించారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న ఇసుక విధానం గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదన్నారు. లక్ష కోట్ల దోపిడీ అంటోన్న తెదేపా నేతలు టెండర్లలో ఎందుకు పాల్గొనలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ దురుద్దేశంతో వారు ఆరోపణలు చేస్తున్నారన్న మంత్రి... ఇసుక సరఫరాపై తెదేపా అసత్య ప్రచారాలు చేయడాన్ని ఇప్పటికైనా ఆపాలన్నారు.
ఇదీ చూడండి. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మహిళ హల్చల్