పర్యాటక రంగ అభివృద్ధి, పాపికొండలకు బోట్ల పునఃప్రారంభం తదితర అంశాలపై.. అధికారులు, బోటు ఆపరేటర్లతో ఆయన విజయవాడ బరంపార్కులో మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో ఉన్న రెస్టారెంట్లలోనే.. అదీ ఇతర దేశాల పర్యాటకులకే విదేశీ మద్యం అందుబాటులో ఉంటుందని అన్నారు.
‘మేమేదో మద్యాన్ని ప్రమోట్ చేస్తున్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఊరూరా బెల్టు షాపులు పెట్టించి, తెదేపా కార్యకర్తలతో మద్యం అమ్మించారు’ అని మంత్రి విమర్శించారు. పర్యాటక రంగాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని, ప్రతిదాన్నీ రాజకీయం చేయడాన్ని తెదేపా మానుకోవాలని ముత్తంశెట్టి సూచించారు. కరోనా కారణంగా రాష్ట్రంలో నిలిచిపోయిన బోట్లను తిరిగి ప్రారంభిస్తున్నామని, వీటిపై పర్యవేక్షణకు పోలీసు, రెవెన్యూ, జల వనరులు, పర్యాటకశాఖ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 300 బోట్లలో పర్యాటకశాఖకు చెందిన 48 బోట్లకు అనుమతులున్నట్లు చెప్పారు. ఏడాదిన్నరగా బోట్లు నిలిచిపోయాయని, కొన్ని సడలింపులు ఇవ్వాలని ఆపరేటర్లు కోరారు. పాపికొండలకు బోటు టికెట్ ధరలు పెంచాలని వారు విజ్ఞప్తి చేశారు. భవానీద్వీపం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మరో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీ చదవండి: KRMB: శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ నీటి వినియోగంపై ఏపీ ప్రభుత్వం లేఖ