బల్దియా ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రోడ్‌షోలను ప్రారంభించారు. కూకట్పల్లి ఓల్డ్ అల్లాపూర్, మూసాపేట, బాలానగర్ చౌరస్తాలో ప్రచారం నిర్వహించారు. తెరాస అభ్యర్థులను గెలిపించి.. ఈసారి 100 స్థానాలు గెలిచేలా దీవించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మభ్యపెట్టే హామీలు...
ఆరేళ్లలో తెరాస సర్కార్ పాలనలో హైదరాబాద్ సమగ్ర అభివృద్ధికి ఎన్నో పనులు చేశామని వివరించారు. నిరంతర విద్యుత్ పాటు తాగునీటి ఎద్దడిని నివారించిన ఘనత తెరాసకే దక్కుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం భాజపా రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టేందుకు హామీలు ఇస్తోందని విమర్శించారు.
మీరే తేల్చుకోండి...
తెరాస సర్కార్ పాలనలో హైదరాబాద్ శాంతిభద్రతలతో ప్రశాంతంగా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి హైదరాబాద్ కావాలా? ఆరాచకా హైదరాబాద్ కావాలా తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు.
ఇదీ చూడండి: 'ఇది అమాయకపు అహ్మదాబాద్ కాదు హుషార్ హైదరాబాద్'