KTR on AP CM Jagan: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ఏపీ ప్రభుత్వంతో ఉన్న సంబంధాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ సర్కారుతో చక్కటి సంబంధాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఎటువంటి పంచాయితీలు లేవని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రాల విభజన తర్వాత ఉండే కొన్ని అంశాలు.. కేంద్రం తేల్చాల్సిన విషయాల్లో కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్ల చిన్న చిన్న సమస్యలు ఉన్నాయన్నారు. అంతే కానీ ఎటువంటి సమస్యలు లేవన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తనకు పెద్దన్న లాంటి వారని ఈ సందర్భంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కూడా జగన్‌కు చక్కని సంబంధాలు ఉన్నాయన్నారు. తమకు ఏనాడు కూడా పంచాయితీలు లేవన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలాంటి పొరపొచ్చాలు లేవన్నారు. చంద్రబాబు తమ ప్రత్యర్థులతో చేతులు కలిపి ఆయనే ఏదో ఊహించుకున్నారని.. కానీ ఆయనతో ఎలాంటి తగాదా లేదన్నారు.
తాము రాజకీయాల్లో ఎవరినీ శత్రువులుగా చూడమన్న కేటీఆర్.. కేవలం వారిని ప్రత్యర్థులుగానే చూస్తామన్నారు. పక్క రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, అందిరతోనూ సత్సంబంధాలే కోరుకుంటామన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేసీఆర్ అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు, జగన్‌లతో సత్సంబంధాలే ఉన్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు.
"జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో మాకు చక్కని సంబంధాలు ఉన్నాయి. పంచాయతీ ఏమీ లేదు. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన విషయాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే ఉండొచ్చు కానీ ఇతర విషయాల్లో సుహృద్భావ సంబంధాలు ఉన్నాయి. కేంద్రం ఉదాసీన వైఖరి వల్లే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వారు నాకు పెద్దన్న లాంటి వారు. ముఖ్యమంత్రి గారికి కూడా వారితో మంచి సంబంధాలే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా మాకు ఎలాంటి తగాదాలు లేవు. చుట్టు పక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా సత్సంబంధాలనే కోరుకుంటాం." -కేటీఆర్, రాష్ట్ర మంత్రి
ఇవీ చదవండి: