భాజపాపై మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బద్వేలు ఉపఎన్నికలో వైకాపాకు 90 వేలకు పైగా మెజార్టీ వస్తే.. భాజపాకు డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. భాజపాకు రాష్ట్ర ప్రజలు గడ్డి పెట్టారన్న ఆయన.. స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా చోట్ల డిపాజిట్లు లేకుండా నోటా కంటే తక్కువ ఓట్లు వేశారని వ్యాఖ్యానించారు. జగన్ మేక, నక్క కాదు.. పులివెందుల పులి అన్నారు. సోనియాగాంధీనే జగన్ ఈకముక్కలా తీసి పక్కన పారేశారని గుర్తు చేశారు. భాజపా నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.
పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించే ప్రసక్తే లేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ధరలు వంద రూపాయలు దాటించిన ఘటన భాజపాదే అని దుయ్యబట్టారు. ధరలను తగ్గిస్తే కేంద్రమే తగ్గించాలని డిమాండ్ చేశారు. కులాల, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆక్షేపించారు. జనసేన ఓ పనికిమాలిన పార్టీ అంటూ విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరించిన భాజపాతో పొత్తుకు పవన్‌కు సిగ్గు లేదా? అని ప్రశ్నించారు.
పెట్రో ధరలపై తెదేపా నిరసనలపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు మంత్రి కొడాలి నాని. గల్లీలో ధర్నాలు చేయకుండా.. చంద్రబాబు దిల్లీ వెళ్లి ధర్నా చేస్తే ఫలితం ఉంటుందని హితవు పలికారు. తెదేపా హయాంలో సర్ ఛార్జీల పేరుతో ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు తగ్గించి..నాటకాలు ఆడారని దుయ్యబట్టారు. అలాంటి తెదేపాను..ప్రజలు డీజిల్ పోసి తగులబెట్టారంటూ మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల ఎన్నికలు జరుగుతున్నాయని.. అందులో లబ్ధి పొందేందుకు.. రాష్ట్ర సర్కార్‌పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్త చేశారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా.. ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం ఎలాంటి పన్నులు వసూలు చేసినా.. రాష్ట్ర ప్రగతి కోసమే ఖర్చు చేస్తోందని స్పష్టం చేశారు.
'వారంలో అఖిలపక్షాన్ని దిల్లీ తీసుకెళ్లాలని జగన్‌కు వార్నింగ్ ఇస్తున్నారు. మోదీ, అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోసం పవన్, చంద్రబాబు రెండున్నరేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. మోదీ, అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోసం జగన్ కావాలి. స్టీల్ ప్లాంట్ వ్యవహారం అడ్డుపెట్టుకుని అఖిలపక్షాన్ని దిల్లీ తీసుకెళ్లాలంటున్నారు. అఖిలపక్షంలో పవన్, చంద్రబాబు దూరి దిల్లీ వస్తామంటారు. వ్యక్తిగతంగా మాట్లాడాలని కాళ్లు పట్టుకుంటారు. అలయన్స్‌లు, రాజకీయాల గురించి మాట్లాడాలని యత్నిస్తున్నారు. ముగ్గురు కలిసి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు' - కొడాలి నాని, రాష్ట్ర మంత్రి
ప్రజా సమస్యల పేరుతో అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలంటూ డ్రామాలు చేస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. వారి రాజకీయ అవసరాల కోసం కేంద్రం వద్దకు తీసుకెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడూ డెడ్‌లైన్లు పెట్టకూడదన్న ఆయన.. వారం కాదు ఏడేళ్లు సమయమిచ్చినా కేంద్రం వద్దకు జగన్ తీసుకెళ్లరని స్పష్టం చేశారు. రాష్ట్రం కోసం ఏం చేయాలో సీఎం జగన్‌కు తెలుసన్నారు. ప్రాజెక్టులు, సరిహద్దు సమస్యలపై ఒడిశా సీఎంను జగన్ కలుస్తున్నారని తెలిపారు.
ఇదీ చదవండి