ఆగస్టు నుంచి సెప్టెంబర్ చివరి వరకు రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. రెండు నెలల్లోనే వర్షాల వల్ల తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో 1.15లక్షల ఎకరాలు వ్యవసాయ పంటలు, 23511 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని మంత్రి తెలిపారు. భారీ వర్షాల వల్ల 3వేల కిలోమీటర్లు రోడ్లు దెబ్బతిన్నాయని, 65 మైనర్ ఇరిగేషన్ సోర్సులు, పంచాయతీరాజ్, మున్సిపల్ విభాగాల్లో రోడ్లు, భవనాలు దెబ్బతిన్నాయని వివరించారు.
ప్రస్తుతం కురుస్తోన్న వర్షాల వల్ల జరిగిన పంటనష్టంపై ఇంకా ఎన్యుమరేషన్ జరుగుతోందని మంత్రి కన్నబాబు చెప్పారు. నష్టాల నివేదిక ప్రభుత్వానికి చేరిందని.. పరిహారం, సహాయంపై సీఎం జగన్ సమీక్షించారని వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల వారిని ఆదుకునేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. పంట నష్టం జరగలేదని చంద్రబాబు విమర్శించడం సరికాదని హితవు పలికారు.
డీజీపీపై చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని మంత్రి కన్నబాబు విమర్శించారు. పోలీసు వ్యవస్థను దిగజార్చారని చంద్రబాబు దారుణంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. జరిగిన దానిని వివరిస్తూ గౌరవప్రదంగా డీజీపీ లేఖ రాస్తే ఇదా మీ సమాధానమని మండిపడ్డారు. దేవాలయాలపై దాడుల వెనుక అత్యధిక ఘటనలో తెదేపా కార్యకర్తలే ఉన్నారని పోలీసు విచారణలో తేలిందన్నారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్న కన్నబాబు... ప్రతిదాన్నీ రాజకీయానికి, ప్రభుత్వంపై బురద జల్లేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండీ... కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్