రాజధాని రైతులకు రేపటి నుంచి కౌలు చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సీఆర్‌డీఏపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాజధాని అంశంపై వాస్తవాలు పరిశీలించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రాజధానిపై మరోసారి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రాజధానిలో ల్యాండ్ సేకరణకు సంబంధించి 43 వేల ప్లాట్ల రిజిస్ట్రేషన్ జరిగిందని... మిగతా స్థలాల రిజిస్ట్రేషన్లు జరగాల్సి ఉందని తెలిపారు. రాజధానికి సంబంధించి రూ.35 వేల కోట్లతో టెండర్లు పిలిచారని... వాటికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు లేవని చెప్పారు.
సుజనాకు భూములున్నాయి
రాజధానిపై గతంలో చేసిన మాటలకు కట్టుబడి ఉన్నామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.రాజధాని ప్రాంతంలోనే సుజనా చౌదరి భూములున్నాయని మరోసారి స్పష్టం చేశారు. రాజధాని మారుతుందని జీవీఎల్ ఎందుకు మాట్లాడారో తెలియదని వెల్లడించారు. రాజధానిలో నిర్మిస్తోన్న హ్యాపీ నెస్ట్‌పై రివర్స్ టెండరింగ్‌కు వెళ్తామని ప్రకటించారు. హ్యాపీ నెస్ట్ కాంట్రాక్ట్ ధర అధికంగా ఉందని తమ అభిప్రాయని వెల్లడించారు. రివర్స్ టెండరింగ్ చేసి లబ్ధిదారులకు మేలు చేస్తామని తెలిపారు. టెండర్ల దశలో ఉన్నవి ఇప్పటికే రద్దు చేశామని చెప్పారు. ఇటీవల రాజధానికి వరదముప్పు ఉందని పదేపదే చెబుతోన్న మంత్రి బొత్స..ఇవాటి సమావేశంలో మాత్రం ఆ అంశంపై ఏ విధమైన చర్చ జరగలేదని చెప్పారు
అమరావతి రాజధానిగా ఉంటుందా?
అమరావతి రాజధానిగా కొనసాగుతుందా అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సమాధానం దాటవేశారు. ఆర్థిక పరిస్థితులు చూసుకుని ఏవిధంగా ముందుకెళ్లాలో ఆలోచిస్తామని తెలిపారు. రాజధాని 5 కోట్ల మంది ప్రజలదని... ఏ ఒక్క సామాజిక వర్గానిది కాదని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. రాజధానిపై కొంత కాలంలో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: గోదావరి - కృష్ణా అనుసంధానంతో అద్భుతాలు:కేసీఆర్