ఎస్ఈసీ వ్యవహారంలో.. హైకోర్టులో తెదేపా పిటిషన్ వేయడంలో ఉన్న ఆంతర్యమేంటని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వ్యక్తిగతంగా నష్టపోయిన రమేశ్‌కుమార్ కోర్టును ఆశ్రయించినా అర్థం ఉందన్న ఆయన... తెలుగుదేశం నేతల ఆసక్తి ఏంటని నిలదీశారు. ఎస్ఈసీ పదవి కాలం తగ్గించిన విషయంపై కోర్టుకు వెళ్లారా..? లేదా రమేశ్ కుమార్‌పై ఉన్న అభిమానంతో వెళ్లారా అనేది చెప్పాలని డిమాండ్ చేశారు.
న్యాయస్థానాల పట్ల తమ ప్రభుత్వానికి గౌరవం ఉందని మంత్రి బొత్స అన్నారు. కోర్టు తీర్పుకు వక్రబాష్యాలు సరికాదనే అడ్వొకేట్ జనరల్ చెప్పారని వివరించారు. రాజధానిపై ప్రభుత్వం ఇప్పటికే చట్టం చేసిందని అన్నారు. ప్రస్తుతానికి ఆ అంశం కోర్టులో పెండింగ్ ఉందని గుర్తు చేశారు. న్యాయస్థానంలో రాజధాని అంశం తేలాకే తగిన నిర్ణయం తీసుకుని ముందుకెళ్తామని చెప్పారు.
విద్యుత్ ఛార్జీలు విధించే విధానంలో మార్పులు చేశామని వెల్లడించారు. పేద ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం వేయలేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ... ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని మంత్రి సవాల్ విసిరారు.
ఇదీ చదవండి: