Minister Botsa On 3 Capitals: ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని తాము ఎక్కడా చెప్పలేదని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతే రాజధాని అని తమ మేనిఫెస్టోలో పెట్టలేదని..ఉంటే చూపెట్టాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నదే.. సీఎం జగన్, వైకాపా అభిప్రాయమని స్పష్టం చేశారు. ఇందుకోసమే మూడు రాజధానుల అంశాన్ని ముందుకు తీసుకువచ్చామని తెలిపారు.శాసన రాజధానిగా అమరావతిని చెప్పాం ... దీన్నే కొనసాగిస్తామన్నారు మంత్రి బొత్స. అందరితో చర్చించి తప్పులు సవరించి మెరుగైన బిల్లును తీసుకువస్తామని స్పష్టం చేశారు.
చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చి మాట్లాడండి...
Minister Botsa Slams BJP: రాజధాని అంశం విషయంలో భాజపా వైఖరిపై మంత్రి బొత్స మండిపడ్డారు. అమరావతి అవినీతి కూపమని, పోలవరం ఏటీఎం అని సాక్షాత్తూ ప్రధానే చెప్పారని గుర్తు చేశారు. గతంలో భాజపా మాట్లాడిన మాటల్ని తప్పుగా మాట్లాడినట్లు ఒప్పుకోవాలన్నారు. చంద్రబాబు నీతిమంతుడని క్లీన్ చిట్ ఇచ్చి.. ఆ తర్వాత భాజపా నేతలు మాట్లాడాలన్నారు. అమరావతికి మద్దతంటూనే రాయలసీమలో హైకోర్టు పెట్టాలని భాజపా నేతలు చెప్పడాన్ని ఏమనాలన్నారు. భాజపా నేతలు ఏదైనా ధైర్యంగా చెప్పాలని హితవు పలికారు. భాజపా నేతలంతా రాజకీయం కోసం వారి స్టాండ్ మార్చుకుంటే తమకేమీ అభ్యంతరమేమీ లేదన్నారు. తాము ముమ్మాటికీ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామన్నారు.
అక్కడ తెదేపా రాజకీయ సభే..
Minister Botsa On Tirupati Meeting: రేపు తిరుపతి వేదికగా అమరావతి రైతులు తలపెట్టిన సభపై బొత్స స్పందించారు. అక్కడ జరిగే సభ.. తెదేపా రాజకీయ సభే అని వ్యాఖ్యానించారు. పాదయాత్రగా తిరుపతికి నడుచుకుంటూ వెళ్లిన వారంతా తెలుగుదేశం సానుభూతిపరులే అన్నారు. రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేసేందుకు పాదయాత్ర చేపట్టారని విమర్శించారు.
'తిరుపతిలో రేపు జరిగే సభ తెదేపా రాజకీయ సభే. పాదయాత్రగా వెళ్లినవారంతా తెదేపా సానుభూతిపరులే. 13 జిల్లాలు అభివృద్ధి చేయడం సీఎం, వైకాపా విధానం. 3 రాజధానులు ఏర్పాటు చేయాలన్నదే వైకాపా ఆలోచన. మేము ముమ్మాటికీ 3 రాజధానులకు కట్టుబడి ఉన్నాం. రాయలసీమకు అన్యాయం చేసేందుకు పాదయాత్ర చేపట్టారు. ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని మేం చెప్పలేదు' - మంత్రి బొత్స సత్యనారాయణ
రేపు తిరుపతిలో రైతుల సభ
Amaravati Farmers Public Meeting in Tirupati: అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ పేరిట.. రేపు రాజధాని రైతులు తిరుపతిలో తలపెట్టిన బహిరంగ సభకు.. ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. సీఎం జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసి, రేపటికి రెండేళ్లవుతున్న సందర్భంగా ఈ సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తుళ్లూరు నుంచి తిరుమల వరకూ పాదయాత్ర పూర్తి చేసిన రైతులు.. రేపటి సభ కోసం ఎదురు చూస్తున్నారు. సమయం ఒక్కరోజు మాత్రమే ఉండటంతో ఏర్పాట్లు వేగంగా చేస్తున్నారు. ఈ ఉదయం ఐకాస నేతలు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమరావతి ఐకాస నేతలు శివారెడ్డి, గద్దె తిరుపతిరావు, రాయపాటి శైలజ, తెదేపా నేత పులివర్తి నాని పాల్గొన్నారు. రేపటి సభకు తెదేపా అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. సీపీఐ, జనసేన నాయకులు కూడా పాల్గొనే అవకాశముంది. సభ విజయవంతం చేయాలంటూ తెలుగుదేశం, భాజపా, సీపీఐతో పాటు పలువురు నేతలు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:
Cinema Tickets Issue: సినిమా టికెట్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఏంటంటే..?