రాష్ట్ర ప్రభుత్వం మరో వారం రోజుల్లో కొత్త పర్యటక విధానాన్ని ప్రకటించనుందని ఆ శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పర్యటక ప్రాంతాలను అభివృద్ధి చేసి.. రాష్ట్ర, రాష్ట్రేతర, విదేశీ సందర్శకులను మరింత ఎక్కువగా ఆకర్షించాలనేది తమ ఉద్దేశ్యమన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... రాష్ట్ర పర్యటకానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని వెల్లడించారు.
సీఎం జగనే అంబాసిడర్...
సినీనటులు, సెలబ్రెటీల ద్వారా ఇతర రాష్ట్రాలు పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం సీఎం జగన్ అంబాసిడర్‌గా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. కరోనా ప్రభావం పర్యాటక రంగం పై తీవ్ర ప్రతికూలతను చూపిందని.. గత ఆరు నెలల నుంచి భారీగా పర్యాటక శాఖ ఆదాయం కోల్పోయిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పర్యటక ప్రాంతాలకు సందర్శకులను అనుమతించిందని చెప్పారు. పాపికొండలు మినహా మిగిలిన ప్రాంతాల్లో సుమారు 60 బోట్లు నడిపేందుకు అనుమతించామన్నారు. రానున్న కార్తీక మాసాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యటక ప్రదేశాల్లో సదుపాయాలు, సందర్శకుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు..
గత అనుభవాలను, సంఘటనలను దృష్టిలో ఉంచుకుని బోట్లు నడిపే తొమ్మిది ప్రాంతాల్లో పోలీస్ , రెవెన్యూ , పర్యాటక, నీటిపారుదల తదితర శాఖల అధికారులతో కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో బోట్లు నడిపేలా పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
38 హోటల్స్ ను నిర్వహిస్తున్నాం..
రాష్ట్రంలో పర్యటకశాఖ ద్వారా 38 హోటల్స్ నిర్వహిస్తున్నామని కరోనా సమయంలో వీటిలో కొవిడ్ సెంటర్ల నిర్వాహణతో పాటు కొవిడ్ కేంద్రాలకు ఆహారం సరఫరా చేయడం ద్వారా 28 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందినట్లు మంత్రి తెలిపారు. తిరుపతి, విశాఖపట్నంలో స్టార్ హోటల్స్ నిర్మాణానికి ప్రయత్నాలను ముమ్మరం చేశామన్నారు. ఇప్పటికే ఓబరాయ్ సంస్థ ఇందుకు సంబంధించి స్థలాల పరిశీలన చేసిందని చెప్పారు. రాబోయే రోజుల్లో నదులు, సముద్రాలు, ఆలయ పర్యాటకంతో పాటు అడ్వంచెర్ టూరిజంను అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అవంతి తెలిపారు.
ఇదీ చదవండి: