జగనన్న విద్యాకానుక కార్యక్రమంపై ప్రతిపక్షం బురద చల్లుతోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మంచి కార్యక్రమాన్ని చూసి ప్రతిపక్షం కడుపు రగిలిపోతోందని ఆయన విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. కేంద్రం నిధులతో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహించారు.
43 లక్షల మంది విద్యార్ధులు లబ్ధి పొందుతున్న ఈ పథకం దేశంలో మరెక్కడా అమలు కావడం లేదని తెలిపారు. ఇతర రాష్ట్రాలు ఈ పథకం గురించిన వివరాలు ఆరా తీస్తుంటే.. ప్రతిపక్షానికి మాత్రం బాధ కలుగుతోందని అన్నారు. తమ ముఖ్యమంత్రి స్టిక్కర్ సీఎం కారని.. స్ట్రైకింగ్ సీఎం అని పేర్కొన్నారు.
స్కూల్ బ్యాగులు, నోట్ బుక్స్, షూ, బెల్టుల ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు. యూనిఫాం, పాఠ్య పుస్తకాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వ నిధులు విడుదల చేసిందన్నారు. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడైనా ఉందా..? అని ప్రశ్నించారు. జగనన్న విద్యా కానుకపై బహిరంగ చర్చకు సిద్దమని సవాల్ చేశారు. తమ ముఖ్యమంత్రి జగన్ చెప్పారంటే- చేస్తారంతే అని ప్రజలంతా అనుకుంటున్నారన్నారు.