మన రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను వారి సొంత ప్రాంతాలకు శ్రామిక్ రైళ్లలో పంపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పనులు లేని కారణంగా.. తమ ఊళ్లకు వెళ్లిపోతామని అధికారుల వద్ద కార్మికులు మొరపెట్టుకుంటున్నారు. మరోవైపు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాళ్లు ఏపీలో ఎంత మంది? ఎక్కడెక్కడ? ఉన్నారనే సమాచారాన్ని ఇక్కడి అధికారులకు అందిస్తున్నారు.
వీటి ఆధారంగా వలసకూలీల కోసం శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇతరులు ఎవరూ ఈ రైళ్లు ఎక్కేందుకు అనుమతించరు. అసలు స్టేషన్‌లోకే రానివ్వరు. ఆయా జిల్లాల్లోని అధికారులు వలస కూలీలకు పాస్‌లు జారీచేసి, ఆర్టీసీ బస్సుల్లో స్టేషన్‌కు తీసుకొచ్చి రైలు ఎక్కిస్తారు. ఈ రైళ్లను మధ్యలో ఎక్కడా ఆపరు. నేరుగా.. ఆయా రాష్ట్రాలకే వెళ్లి.. కూలీలను నియమిత ప్రాంతాల్లో అధికారులకు అప్పగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
6 రాష్ట్రాలు.. 10 రైళ్లు..
* శ్రామిక్ రైళ్లపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొవిడ్ కంట్రోల్ రూమ్ అధికారులు, అటు దక్షిణ మధ్య రైల్వే మన రాష్ట్రానికి నియమించిన నోడల్ అధికారితో సంప్రదింపులు జరుపుతున్నారు.
* ఇప్పటి వరకు ఆరు రాష్ట్రాలకు చెందిన వారిని పది శ్రామిక్ రైళ్లలో పంపేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది.
* మహారాష్ట్రకు చెందిన వలస కూలీలు, వ్యవసాయ కూలీలు కృష్ణా జిల్లా పరిధిలో ఉండటంతో వారిని విజయవాడ నుంచి బల్హార్షాకు రెండు రైళ్లలో పంపనున్నారు.
* మధ్యప్రదేశ్‌కు చెందినవారు వేర్వేరు చోట్ల ఉండటంతో చిత్తూరు నుంచి జబల్‌పూర్, విజయవాడ నుంచి రాట్లాం, విశాఖపట్నం నుంచి గ్వాలియర్, అనంతపురం నుంచి భోపాల్‌కు ఒక్కో శ్రామిక్‌్ రైలు నడిపేందుకు కసరత్తు చేస్తున్నారు.
* బిహార్‌కు చెందిన వారి కోసం ఏలూరు నుంచి పాట్నా, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారి కోసం ఏలూరు నుంచి గోరఖ్‌పూర్‌లకు ఒక్కో రైలు నడపనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
* ఇక ఒడిశాకు చెందిన వారి కోసం రేణిగుంట నుంచి భువనేశ్వర్‌కు ఒక రైలు నడపనుండగా, రేణిగుంట నుంచి మరొక రైలు న్యూదిల్లీకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇవీ చదవండి: