VVP HOSPITALS: రాష్ట్ర ప్రజారోగ్య, వైద్య విద్యా శాఖల్లో వైద్య విధాన పరిషత్ (వీవీపీ) ఆసుపత్రుల విలీనం ప్రస్తుతానికి ఆగింది. ప్రస్తుతం ప్రజారోగ్య శాఖ(డీహెచ్) పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వీవీపీ ఆధ్వర్యంలో జిల్లా, ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రులు, డీఎంఈ పరిధిలో బోధనాసుపత్రులు పని చేస్తున్నాయి. వైద్య విధాన పరిషత్ కింద 251 ఆసుపత్రులు ఉన్నాయి. అయితే.. పర్యవేక్షణ కరవై వీటి నిర్వహణతోపాటు రోగులకు చికిత్స అందించడంలోనూ సమస్యలు తలెత్తుతున్నాయన్న ఉద్దేశంతో జిల్లా ఆసుపత్రులను డీఎంఈ, ఇతర ఆసుపత్రులను డీహెచ్‌లో విలీనం చేయాలని ప్రభుత్వానికి అధ్యయన కమిటీ నివేదించింది. వైద్యారోగ్య శాఖలో ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమాల దృష్ట్యా విలీనం సరికాదని, ఇప్పుడు ఉన్నట్లుగానే ఆసుపత్రులను కొనసాగించడం మంచిదని అధికారులు నిర్ణయానికి వచ్చారు. దాంతో జులై ఏపీవీవీపీలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బందికి బదిలీలు నిర్వహించనున్నారు. మరోవైపు.. 15 మంది వైద్యులు వీఆర్‌ఎస్ కోసం దరఖాస్తులు చేయగా వాటిని ఆమోదించే విషయంలో త్వరపడకూడదన్న ధోరణిలో అధికారులు ఉన్నారు.
వైద్యుల సంఖ్యపై ప్రతిపాదనలు: ఏపీవీవీపీ పరిధిలోని ఆసుపత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది ఎందరు ఉండాలన్న దానిపై నిర్దిష్టమైన విధానం లేదు. దాంతో 30, 50, 100, అంతకంటే ఎక్కువగా పడకలు ఉన్న ఆసుపత్రుల్లో వైద్యులు, ఉద్యోగులు ఎంతమంది అవసరమన్న దానిపై ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దీంతోపాటు అయిదు జిల్లా ఆసుపత్రులను బోధనాసుపత్రులుగా మార్చడం, వీటిల్లో చేయాల్సిన నియామకాలకు శుక్రవారం జరగనున్న మంత్రివర్గం సమావేశం ఆమోదం తెలపనుంది.
ఇవీ చదవండి: