మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలను వ్యాపారాల వైపు నడిపిస్తోంది. ఇన్నాళ్లూ రుణాలు అందించి సహకరించిన మెప్మా.... ఇప్పుడు ఆ మహిళలు తయారుచేసే ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ కల్పిస్తోంది. ఉత్పత్తులను ఆరు కేటగిరీలుగా విభజించి వాటికి బ్రాండింగ్ ఇస్తున్నారు. మెప్మా సభ్యులు తయారు చేసే అన్ని ఉత్పత్తులకు నారీ అనే బ్రాండ్ ఇమేజ్ కల్పిస్తున్నారు. ప్రధాన బ్రాండ్ నారీతో పాటు కేటగిరీని బట్టి ఉత్పత్తికి సబ్ బ్రాండ్ కల్పిస్తున్నారు.
వివిధ రకాల బ్రాండ్లు
ఆహార ఉత్పత్తులకు "రుచి"..., వస్త్ర, చేతివృత్తులకు సంబంధించిన ఉత్పత్తులకు "హస్తకళ"... ఆభరణాలకు సంబంధించి "స్వర్ణ" పేరిట బ్రాండ్ ఇమేజ్ కల్పిస్తున్నారు. ఇవన్నీ నారీ అనే ప్రధాన బ్రాండ్ కిందకు వస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయ సంఘాల సభ్యులందరికీ మెప్మా ద్వారా ఈ బ్రాండింగ్ సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు. నారీ బ్రాండింగ్ కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాలకు మెప్మా అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బ్రాండ్ ఇమేజ్ పొందడం వల్ల కలిగే లాభాలను వివరిస్తున్నారు.
లాభం ఏంటి?
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు కల్పిస్తున్న ఈ బ్రాండింగ్ సౌకర్యం వల్ల.. స్వయం సహాయక సంఘాల సభ్యులు చేసే ఉత్పత్తులు ఎక్కువ మందికి చేరువకానున్నాయి. క్షేత్రస్థాయిలో యూనిట్లను పరిశీలించి.. ఉత్పత్తుల నాణ్యతను బట్టి వాటికి రేటింగ్ సైతం ఇవ్వనున్నారు. అత్యధిక నాణ్యత ఉన్న ఉత్పత్తులకు ప్లాటినమ్, ఆ తర్వాత స్థాయికి గోల్డ్, ఆ తర్వాత స్థాయికి సిల్వర్ రేటింగ్ ఇవ్వనున్నారు. ఈ రేటింగ్ ద్వారా కూడా ఉత్పత్తులపై ప్రజల్లో అవగాహన కలుగుతుందని మెప్మా యోచిస్తోంది.