Godavari Kaveri link project: గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రక్రియపై చర్చించేందుకు.. జల్‌శక్తి, జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో.. దిల్లీలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి ప్రతినిధులు.. పాల్గొన్నారు. అనుసంధాన ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు వివరించగా.., ఆయా రాష్ట్రాల ప్రతినిధులు తమ సందేహాలు, అభ్యంతరాలను తెలిపారు. పాత లెక్కల ఆధారంగా అనుసంధాన ప్రక్రియను ప్రారంభించడం సరికాదన్న తెలంగాణ అధికారులు.. శాస్త్రీయ అంచనాలతో గోదావరిలో జలాల లభ్యత మదింపు చేపట్టాలని అన్నారు. ఆ తర్వాతే.. రాష్ట్రాల వాటా తేల్చాలని స్పష్టం చేశారు.
గోదావరి జలాల్లో 968 టీఎంసీలపై తమకు హక్కు ఉందన్న తెలంగాణ అధికారులు.. తాము డీపీఆర్‌లు సమర్పించిన ఏడు ప్రాజెక్టులకు అనుమతులివ్వాలని అన్నారు. అనుసంధానానికి గోదావరిలో 75 శాతం నీటి లభ్యతను కాకుండా.. 50 శాతం నీటి లభ్యతనే పరిగణనలోకి తీసుకోవాలన్న తెలంగాణ అధికారులు... తమ వాటా జలాలు తేల్చిన తర్వాతే ముందుకు సాగాలని స్పష్టం చేశారు.అనుసంధానానికి రూపొందించిన.. ఎలైన్‌మెంట్‌ను మార్చాలని విజ్ఞప్తి చేశారు.దిగువ రాష్ట్రంగా.. మిగులు జలాలపై తమకు ఉన్న హక్కులను గుర్తించాలన్న ఏపీ ప్రతినిధులు.. మిగులు జలాలున్నట్లు తేలితే అనుసంధాన ప్రక్రియపై అభ్యంతరం లేదని తెలిపారు. గోదావరి నీటి మళ్లింపు ప్రక్రియను.. ఇచ్చంపల్లి నుంచి కాకుండా.. పోలవరం నుంచి చేపట్టాలని పేర్కొన్నారు.
గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరి అనుసంధానంతో తమకు నీటి వాటాలు దక్కే పరిస్థితి లేనందున.. ప్రత్యక్షంగా వాటా కేటాయించాలని కర్ణాటక కోరింది.కావేరి నుంచి నీటి లభ్యత లేకపోవడంతో తమిళనాడులో ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్న ఆ రాష్ట్ర ప్రతినిధులు.. మొత్తం లక్ష్యం 247 టీఎంసీల్లో 200 టీఎంసీలు తమకు కేటాయించాలని.. కోరారు. గోదావరిలో నీటి లభ్యతపై ఏపీ, తెలంగాణలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నందున ….. ప్రస్తుతానికి ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని 4 బీసీఎం నీటి మళ్లింపునే..... పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని సీడబ్ల్యూసీ ఛైర్మన్ ఆర్‌కే సిన్హా అన్నారు. ట్రైబ్యునల్ అవార్డు ఆధారంగానే.. నీటి లభ్యతను అంచనా వేస్తామన్నారు. ప్రాజెక్టుల వారీగా.. ఎలైన్‌మెంట్లకు తుదిరూపు ఇస్తామని, ఏ రాష్ట్రానికి ఎంత నీరు కేటాయించాలో సంప్రదింపుల ద్వారా నిర్ణయిస్తామని వెల్లడించారు. నదుల అనుసంధానంపై ఏకాభిప్రాయంతోనే .. ముందుకెళ్లాలనేది కేంద్ర ప్రభుత్వ నిశ్చితాభిప్రాయమని.. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ స్పష్టం చేయగా.....జాతీయ ప్రయోజనాల దృష్ట్యా.. అనుసంధాన ప్రక్రియకు ముందుకు రావాలని జల్‌శక్తి సలహాదారు వెదిరె శ్రీరాం రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: CM KCR Comments: 'ఏ అధికారంతో గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేస్తారు..'