Relationship Issues : ఆమె విషయంలో జరిగింది బాధాకరమే. సాన్నిహిత్యం, నిబద్ధత, నమ్మకం ఉంటేనే ఆడ, మగ మధ్య ప్రేమ దృఢమవుతుంది అంటాడు ప్రఖ్యాత సైకాలజిస్ట్ రాబర్ట్ స్టీన్‌బర్గ్. అంతకుముందు వాళ్ల అనుబంధంలో ఈ మూడూ ఉండేవి గనకే ప్రేమ పెళ్లి చేసుకున్నారు. తర్వాత అవి ఎందుకు లోపించాయి? తను వేరే అమ్మాయికి ఎందుకు దగ్గర కావాల్సి వచ్చిందో ఆలోచించాలి? ఇది జరిగాక అయినా తనని అడగాల్సింది.
ఏదేమైనా తను మరొకరితో సన్నిహితంగా ఉండటం సమర్థనీయం కాదు. విషయం తెలిశాక, ఇలాంటివి వద్దు అని చెప్పిన తర్వాత కూడా అతను మళ్లీ అలా చేయడం ముమ్మాటికీ తప్పే. పాప కోసం ఆ నమ్మక ద్రోహం, బాధ భరించడం నిజంగా అభినందనీయం. కానీ ఎన్నాళ్లిలా? ఆమెది చిన్న వయసే. బోలెడంత భవిష్యత్తు ఉంది. దంపతులిద్దరూ ఎడమొహం, పెడమొహంగా ఉంటే అది పాప భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుంది. అతడికి మరో అవకాశం ఇచ్చి చూడాలి. ఇలాంటివి పునరావృతం అయితే బాగుండదని గట్టిగా హెచ్చరించాలి. బహుశా అతడు మారొచ్చు.
ప్రేమించి, పెద్దల్ని ఒప్పించి పెళ్లాడిన అమ్మాయి మనసు నొప్పిస్తున్నాననే విషయం తెలిసి అతడిలో మార్పు రావొచ్చు. ఇప్పటికీ అతను.. పాపని, భార్యను ప్రేమిస్తుంటే తప్పకుండా మారతాడు. గతంలోనూ అమ్మాయిల ఆకర్షణకు లోనైన వ్యక్తి అయితే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అన్నింటికీ ముందు అతడిని కూర్చోబెట్టి అసలు ఆయన మనసులో ఏముంది? ఎందుకు అలా చేశారు? అని ఒపిగ్గా అడగాలి. ఆమెంత బాధ పడుతుందో వివరించాలి. తను సవ్యంగా లేకపోవడం వల్ల కలుగుతున్న పర్యవసానాలు వివరించండి. అవసరమైతే పెద్దలతో చెప్పించాలి. ప్రస్తుతం ఉంటున్న ఇంటిని మార్చి వేరేచోటికి వెళ్తే.. ఆ చేదు జ్ఞాపకాల్లోంచి కొంత బయటపడే అవకాశం ఉంటుంది. ఈ ప్రయత్నాలు చేస్తే తప్పకుండా ఫలితం సానుకూలంగా ఉంటుంది.
ఇవీ చదవండి: