పదిమందిని శుభకార్యానికి ఇంటికి పిలిచే పరిస్థితులు లేకుండా పోయాయి. అయిదు రోజుల పెళ్లిళ్లు, సందళ్లు నుంచి రెండు కుటుంబాలే కలిసి మాంగల్యధారణ చేయించే రోజులు వచ్చేశాయి.
ఆహ్వానాల తీరు కూడా పూర్తిగా మారిపోయింది. ‘‘మా అబ్బాయికి, వారి అమ్మాయితో పెళ్లి. ఆగస్టు 16 రాత్రి ముహూర్తం. ఈ కింది లింకులో మీకు లైవ్ అందుబాటులో ఉంటుంది. ఆ సమయంలో మాతో పాటు లైవ్‌లో చేరండి’’...ఇవీ తాజా పెళ్లిళ్ల ఆహ్వానాలు..
జలవనరుల శాఖలో పనిచేసే ఒక అధికారి తన కూతురు వివాహాన్ని రాజమహేంద్రవరానికి చెందిన వరుడితో నిశ్చయించారు. ఏప్రిల్ 8న పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. శుభలేఖలు పంచేశారు. ఘనంగా అందరినీ ఆహ్వానించారు. పెద్ద స్థాయిలో రాజమహేంద్రవరంలో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేసేశారు. ఇంతలో కరోనా లాక్‌డౌన్ రావడంతో ప్రణాళికలన్నీ తల్లకిందులయ్యాయి. ఆ రోజు పెళ్లి చేసేందుకు అవకాశం లేని పరిస్థితి. కొద్ది రోజులు ఆగితే అదే స్థాయిలో పెళ్లి చేయవచ్చనుకున్నారు. నెలలు గడిచేకొద్దీ పరిస్థితి తీవ్రమవుతోంది తప్ప కుదుటపడేలా లేదు. దీంతో ఆ వివాహం హైదరాబాద్‌లో కొద్ది మంది బంధువుల సమక్షంలో చేశారు. అందరికీ లైవ్‌లో చూసే అవకాశం కల్పించారు.
* పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఒక అధికారి వాళ్ల కుమారుడి కల్యాణం నిమిత్తం తొలుత భీమవరంలో ఏర్పాట్లు చేశారు. తర్వాత అక్కడ సాధ్యం కాదని భావించి హైదరాబాద్‌లోనే పెళ్లి మండపం మట్లాడుకుని వివాహం చేశారు. అందరికీ వాట్సప్‌లో ఆహ్వానం పంపారు. లైవ్‌లో చూడాలంటూ లింకు షేర్ చేశారు.
కరోనా తగ్గాక రిసెప్షన్!
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక వ్యవసాయ శాఖ అధికారి..తన ఇంట్లో వివాహం ఏర్పాట్లు చేసుకున్నారు. కావాల్సిన వారందరికీ ఫోన్ చేసి విషయం చెప్పారు. కరోనా తగ్గాక రిసెప్షన్ ఏర్పాటు చేస్తాం. అప్పుడు అందరం కలుసుకుందాం అని చెప్పారు...ఇది మరో తరహా ఆహ్వానం.
పెద్దగా ఎవరినీ పిలవలేదు...
మీరు మాత్రం రావాలి
కోస్తా జిల్లాల్లోని ఒక ఐటీడీఏలో మేనేజర్‌గా పనిచేసే ఒక అధికారి...వారం కిందట తన కుమార్తె పెళ్లి నిశ్చయం చేశారు. కొద్ది మంది స్నేహితులను, బంధువులనే పిలుస్తూ...‘‘ఎక్కువ మందిని పిలవడం లేదు. మనం కొద్ది మందిమే. మాస్కులు, శానిటైజర్లు ఏర్పాటు చేశాను. దూరం దూరంగా కూర్చోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు...తప్పకుండా రండి’’ అని విన్నవించారు. తీరా భయంతో ఎవరూ రారేమో అన్న సందేహాలు వారిని వెంటాడుతున్నాయి.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి.. కొత్తగా 8,732 కేసులు నమోదు