Mangal Industries: అమరరాజా గ్రూపు అనుబంధ సంస్థ మంగళ్ ఇండస్ట్రీస్.. రానున్న మూడేళ్లలో రూ.3,000 కోట్ల ఆదాయాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఎగుమతులపై దృష్టి సారించడంతో పాటు, ఏరోస్పేస్, రక్షణ, వైద్య పరికరాల తయారీ రంగంలోకి ప్రవేశించబోతున్నట్లు సంస్థ డైరెక్టర్ హర్షవర్ధన గౌరినేని తెలిపారు. అమరరాజా బ్యాటరీలకు అవసరమైన విడి భాగాలను అందించేందుకు చిన్న సంస్థగా ప్రారంభమైన మంగళ్ ఇండస్ట్రీస్ క్రమంగా వాహన విడిభాగాలు, సరకుల నిల్వకు అవసరమైన స్టాండ్లు, బ్యాటరీ విడి భాగాలు, మెటల్ ఫ్యాబ్రికేషన్ తయారీలోకి విస్తరించి, గ్రూపులో రెండో అతిపెద్ద సంస్థగా కొనసాగుతోంది.
భారత్‌లోని అనేక పెద్ద బ్రాండ్లు తమ ఖాతాదార్లని హర్షవర్ధన తెలిపారు. 2020-21తో పోలిస్తే రూ.450 కోట్లు అధికంగా, 2021-22లో సంస్థ రూ.1,400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని వెల్లడించింది. నికరలాభమూ 10 శాతం పెరిగిందన్నారు. భవిష్యత్తులోనూ ఇదే తరహా వృద్ధి కొనసాగిస్తామని పేర్కొన్నారు.
విస్తరణ కోసం మూడు - అయిదేళ్లలో రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని తెలిపారు. తమ ఉత్పత్తుల్లో ఐఓటీ, బ్లాక్‌చైన్, మెషీన్ లెర్నింగ్, కృత్రిమ మేధ తదితరాలను అనుసంధానం చేసే ప్రణాళికలు ఉన్నాయన్నారు.
ఇదీ చూడండి: 'కేంద్ర సంస్థల ఏర్పాటులో వేగం పెంచండి.. ఏపీ ప్రభుత్వశాఖలతో చర్చించండి'