జాతిపిత మహాత్మా గాంధీ 73వ వర్ధంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిచారు. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు.. గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
విశాఖ జిల్లాలో..
మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు విశాఖలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్ముని ఆశయ సాధనకు దేశమంతా కృషి చేయాలని కోరారు. నర్సీపట్నంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో గాంధీ వర్ధంతి వేడుకను ఆంధ్రప్రదేశ్ జన విజ్ఞాన వేదిక విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. 'మతోన్మాదాన్ని వ్యతిరేకించండి' అనే ప్లకార్డులను ప్రదర్శించి.. ప్రజలకు అవగాహన కల్పించారు.
కృష్ణా జిల్లాలో..
అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి, నివాళులర్పించారు. మహాత్ముడు దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శనీయుడని బుద్దప్రసాద్ అన్నారు. పెనుగంచిప్రోలు మండలంలోని ముండ్లపాడు గ్రామంలో గాంధీ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
గుంటూరు జిల్లాలో..
కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో.. జాతిపిత మహాత్మా గాంధీ 73వ వర్ధంతిని ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షడు మస్తాన్ వలి.. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. సత్యం, అహింస సిద్ధాంతాల ద్వారా ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన.. గాంధీజీ మార్గం సదా ఆచరణీయమని వలి పేర్కొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో..
తణుకులో తెదేపా, వైకాపా కార్యకర్తలు గాంధీ వర్ధంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహానికి ఇరుపార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం సాధించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెదేపా నేత ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరిని సమైక్యంగా నడిపించిన వ్యక్తి మహాత్మా గాంధీ అని తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు కొనియాడారు.
ప్రకాశం జిల్లాలో..
గాంధీ 73వ వర్ధంతి సందర్భంగా.. చీరాలలో వైకాపా యువనాయకుడు కరణం వెంకటేష్, వైకాపా రాష్ట్ర కార్యదర్శి వరికూటి అమృతపాని.. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ ఆశయాలను కొనసాగించినప్పుడే.. ఆయనకు మనమిచ్చే ఘననివాళి అని వెంకటేష్ అన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో..
శ్రీకాకుళంలో జాతిపిత మహాత్మా గాంధీ 73వ వర్ధంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని కలెక్టర్ నివాస్ ఆవిష్కరించారు. గాంధీజీ ఆశయాలను కొనసాగించి.. ముందుకు నడవాలని కలెక్టర్ పేర్కొన్నారు.