Lovers Suicide: సిద్ధిపేట జిల్లా ములుగు మండలం పరిధిలో ఓ ప్రేమ జంట చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు మండలం మామిడాల పునరావాస కాలనీకి చెందిన గొట్టి మహేష్‌కు ఏడేళ్ల కిందట మర్కుక్ మండలం భవనందపూర్కు చెందిన కృష్ణవేణితో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె గర్భవతి. మహేష్ ఆటో నడుపుతూ, కూలి పనులకు వెళుతూ జీవనం కొనసాగించేవాడు. ఆటో నడుపుతున్న క్రమంలో ఆరునెలల కిందట మర్కుక్ మండల కేంద్రానికి చెందిన స్వప్నతో పరిచయం ఏర్పడింది.
అలా రోజు మాట్లాడడంతో అది కాస్త ప్రేమగా మారింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ఇంట్లో నుంచి వెళ్లి పోయారు. ఇరువురిపై సంబంధిత పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ల వాళ్ల ఇంటికి పంపించారు. అయినా వారిలో మార్పు రాకపోవడంతో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇవాళ ఇరువురు ములుగు మండలంలోని కొండపోచమ్మ జలాశయం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లి తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని బంధువులకు ఫోన్ చేసి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆస్పత్రికి తరలించామని ములుగు ఎస్ఐ రంగ తెలిపారు.
ఇవీ చదవండి: