రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై జోక్యం చేసుకోవాలని తెదేపా నేత నారా లోకేశ్.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కోరారు. పరీక్షల వాయిదా లేదా రద్దు నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు పంపిన 1778 పేజీల అభిప్రాయాలను జత చేస్తూ లేఖ రాశారు. పరీక్షల నిర్వహణ విద్యార్థులకు ప్రాణసంకటంగా మారనుందని లేఖలో పేర్కొన్నారు.
దేశంలోని దాదాపు 20 రాష్ట్రాలు పరీక్షలను వాయిదా వేస్తే.. ఏపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పది, ఇంటర్ పరీక్షలకు 16.3లక్షల మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉందని లోకేశ్ అన్నారు. దీనివల్ల వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని తెలిపారు.
లక్షలాది విద్యార్థులకు, సిబ్బందికి సురక్షిత వాతావరణం కల్పించటం అసాధ్యమని పేర్కొన్నారు. కొవిడ్‌తో ఏ ఒక్క విద్యార్థి చనిపోయినా అది క్షమించరాని నేరమే అవుతుందన్నారు. కరోనా నియంత్రణ చర్యలు తీసుకోకపోగా, వ్యాధి వ్యాప్తికి అవకాశం కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం సరికాదని తెలిపారు.
ఇదీ చదవండి: పది, ఇంటర్ పరీక్షలపై సీఎం జగన్‌కి సీపీఐ నేత రామకృష్ణ లేఖ