ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఆ దేవుడు కూడా క్షమించడని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురం ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 8మంది చనిపోయిన ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనన్న లోకేశ్.. సీఎం ఇందుకు బాధ్యత వహించాలన్నారు. ప్రతిపక్ష నేతలపై కక్ష సాధించేందుకు వాడే అధికార యంత్రాగాన్ని.. ఇకనైనా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వినియోగించాలని హితవు పలికారు.
"ఆధిపత్య రాజకీయాలపై చూపించే శ్రద్ధ, ప్రజలకు ఆక్సిజన్ సరఫరా పై చూపించి ఉంటే హిందూపురం ఆసుపత్రిలో 8మంది, కర్నూలులో ఆరుగురు, అనంతపురంలో 10 మంది, విజయనగరంలో పలువురు రోగులు చనిపోయేవారు కాదు. ప్రాణవాయువు సరఫరా పై శ్రద్ధ పెట్టకుండా అధికారులు, పోలీసులు, వాలంటీర్లను తిరుపతి ఎన్నికల్లో దొంగ ఓట్ల కేసం, ఉత్తరాంధ్ర ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరచకుండా అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసులు పెట్టడం కోసం సమయాన్ని వెచ్చించారు. రక్షణగా ఉంటారని ప్రజలు ఎన్నుకుంటే.. ప్రతిపక్షంపై కక్ష తీర్చుకుంటున్నారు." - లోకేశ్ ట్వీట్
హిందూపురం ఆసుపత్రి ఘటనకు సంబంధించిన ఓ వీడియోను లోకేశ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి: దారుణం: యువకుడిపై పెట్రోలు పోసి నిప్పంటించిన మిత్రులు