తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు(chandrababu) తీసుకొచ్చిన పరిశ్రమలకు జగన్ రెడ్డి పేరేసుకోవటం సిగ్గుచేటని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(nara lokesh) దుయ్యబట్టారు. రాష్ట్రానికి రూ.30వేల కోట్ల పెట్టుబడులు, 65 ప్రధాన పరిశ్రమలు వచ్చాయంటూ మంత్రి గౌతం రెడ్డి( minister gowtham reddy ) చేసిన ట్వీట్‌కు లోకేశ్ కౌంటర్ ట్వీట్ చేశారు. మంత్రి విడుదల చేసిన జాబితాలో ఉన్న పరిశ్రమలన్నీ తెదేపా హయాంలో వచ్చినవేనంటూ.. ఏ కంపెనీ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక నివేదికలు, ఫోటోలు ప్రజల ముందు పెడుతున్నానంటూ వివరాలతో లోకేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
"సొమ్మొకడిది సోకొకడిది అన్న రీతిలో చంద్రబాబు(chandrababu) సాధించిన పరిశ్రమల్ని నిస్సిగ్గుగా తామే తెచ్చామని ఫేక్ సీఎం జగన్‌రెడ్డి ప్రకటించుకున్నారు. రెండేళ్ల అరాచకపాలనలో ఒక్క కంపెనీ రాకపోవడంతో తెదేపా ప్రభుత్వ హయాంలో వచ్చిన కియా(KIA), హీరో మోటార్స్, అశోక్ లేల్యాండ్, ఇసుజు, అపోలో టైర్స్, మోహన్ స్పిన్టెక్స్, టోరీ, టీసీఎల్‌తో పాటు మొత్తం 16 కంపెనీలు, సంస్థలు తామే తెచ్చామని ప్రకటించుకున్న వైకాపా ప్రభుత్వం అభాసుపాలైంది. వైకాపా బెదిరింపులతో రూ.2వేల కోట్ల పెట్టుబడులతో వచ్చే 17 కియా అనుబంధ సంస్థలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి.
ప్రకాశం జిల్లాలో తెదేపా నేతల క్వారీలపై దాడులు చేసి భారీగా అపరాధ రుసుములు వేసి గ్రానైట్ పరిశ్రమల సంక్షోభానికి కారణమయ్యారు. రాయితీలు ఇవ్వాల్సిన ప్రభుత్వ పెద్దలే కమీషన్ల కోసం వేధించడంతో.. రేణిగుంటలో రిలయన్స్ జియో రూ.15వేల కోట్ల పెట్టుబడి, ఒంగోలులో రూ.24 వేల కోట్ల పేపర్ పరిశ్రమ, విశాఖలో రూ.70వేల కోట్ల అదానీ సంస్థలు వెనక్కి తగ్గారు. రూ.50వేల కోట్ల పెట్టుబడులు వచ్చే సింగపూర్ స్టార్టప్ కంపెనీలు ఒప్పందాలను రద్దు చేసుకోవడం విదేశాలలోనూ రాష్ట్రానికి అపకీర్తి మూటకట్టారు. ఏపీతో ఒప్పందం చేసుకున్న హోలీ టెక్ కంపెనీని ఉత్తర్ ప్రదేశ్‌కి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం జే ట్యాక్స్ వేధింపులే. ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్, హెచ్ ఎస్ బీసీలను బెదిరించి మరీ పంపేశారు. అన్నీ పరిశీలించి రాష్ట్రాభివృద్ధికి, పారిశ్రామికాభివృద్ధికి ఎవరు కృషి చేశారో ప్రజలే నిర్ణయించాలి." అని లోకేశ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: YS Sharmila: పార్టీలో కార్యకర్తలే కీలకం... వారికే పెద్దపీట