తెలంగాణలో వెల్డింగ్ పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న లక్షకుపైగా కుటుంబాలు వీధిన పడ్డాయి. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రదేశాల్లో కొన్ని వీధులే వెల్డింగ్ పనులు చేసే వారితో నిండి ఉంటాయి. స్టీల్, ఇనుముతో గృహాలకు, కార్యాలయాలకు గేట్లు, కిటికీలు, డోర్ల తయారీ, సెంట్రింగ్ ప్లేట్లు, ప్రమాదాలకు గురైన వాహనాల మరమ్మతు, లారీలు, బస్సుల బాడీ నిర్మాణం ఇలా రకరకాల వెల్డింగ్ పనులు చేస్తుంటారు.
ఇందులో కొన్ని దుకాణాల వద్దే పనులు జరుగుతాయి. మరికొన్ని నేరుగా ఆయా ప్రాంతాలకు వెళ్లి చేయాల్సి వస్తుంది. వెల్డింగ్ పనులకు గ్యాస్ వినియోగం తప్పనిసరి. కరోనా బాధితులకు ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో వెల్డింగ్ పనులకు వాడే సిలిండర్లనూ వినియోగిస్తున్నారు. వెల్డింగ్‌కు వాడే గ్యాస్ సిలిండర్లు దొరకడం లేదని.. బ్లాక్‌లో అధిక ధరలకు అమ్ముతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూటగడవని పరిస్థితి..
హైదరాబాద్‌లో వందకుపైగా ప్రదేశాల్లో వెల్డింగ్ దుకాణాలు ఉన్నాయి. కిషన్‌బాగ్, కార్మిక్‌నగర్, చిక్కడపల్లి, చంచలగూడ, ఈస్ట్ మారేడ్‌పల్లి, న్యూ బోయిన్‌పల్లి, రాణిగంజ్, దోమలగూడ, ముషీరాబాద్, ఫతేనగర్, సరస్వతినగర్, గోల్‌నాక, మధురానగర్, అయోధ్యనగర్, కర్మన్‌ఘాట్, జీడిమెట్ల, లోయర్ ట్యాంక్‌బండ్, బహుదూర్‌పుర, మౌలాలి, ఆసిఫ్‌నగర్, ఫతేనగర్, కూకట్‌పల్లి, సరూర్‌నగర్ తదితర ప్రాంతాల్లో వెల్డింగ్ పనులు పెద్దఎత్తున జరుగుతాయి. లాక్‌డౌన్ వరకు వెల్డింగ్ పనులు బాగానే జరిగినా ప్రస్తుతం పూటగడవని పరిస్థితులు నెలకొన్నాయని వెల్డర్లు గోడు వెల్లబోసుకుంటున్నారు. మినహాయింపు ఉన్న నాలుగు గంటల సమయం సరిపోవడం లేదంటున్నారు.
పనులు లేకపోయినా పోషిస్తున్నాం..
వెల్డింగ్ పనలు చేసే కార్మికుల్లో సగం మందికిపైగా బిహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. పనులు లేకపోయినా వలస కూలీలను పోషించాల్సి వస్తోందని వెల్డింగ్ దుకాణదారులు చెబుతున్నారు. ప్రభుత్వం చొరవ చూపి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చూడండి: