వినియోగదారుల సెంటిమెంట్‌పై ఆధారపడే రంగాల్లో స్థిరాస్తి రంగం ఒకటి. కొవిడ్ టీకా రాకతో మార్కెట్లో సానుకూలత కనిపిస్తోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పుంజుకోగా.. తెలంగాణలో ఈ త్రైమాసికంలో కొవిడ్‌కు ముందున్న స్థితికి మార్కెట్ చేరుకుంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లాక్‌డౌన్ విధించిన మే నెలలో పరిస్థితికి కొవిడ్ టీకా సన్నాహాలు మొదలైన డిసెంబరు నాటికి కొనుగోలుదారుల ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చాయని.. 2020 నివేదికలో ప్రాప్ టైగర్ సంస్థ వెల్లడించింది. ఆరునెలల క్రితం స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టేందుకు 35 శాతం మొగ్గు చూపితే.. ఇప్పుడది 43 శాతం వరకు పెరిగింది. మిగతా వాటి నుంచి క్రమంగా రియల్ ఎస్టేట్‌లోకి పెట్టుబడులు వస్తున్నాయి.
హైదరాబాద్‌లో..
- నగరంలో ఇళ్ల సరఫరా గత ఏడాది పొడవునా ఉన్నా డిమాండ్ మాత్రం కొవిడ్ ముందున్న స్థాయికి ఇంకా చేరలేదు. 2019తో పోలిస్తే కొవిడ్ కారణంగా 47 శాతం విక్రయాలు తగ్గాయి. 2019లో 30,682 ఇళ్లను విక్రయిస్తే.. గత ఏడాది 16,400 మాత్రమే విక్రయించారు.
- కొత్తగా అందుబాటులోకి 22,940 ఇళ్లు వచ్చాయి. వార్షిక వృద్ధి 11 శాతం.
- ఇక్కడి మార్కెట్లో ఇళ్లు కావాల్సిన వారే ఎక్కువగా కొంటుంటారు కాబట్టి ధరల్లో ఏటేటా స్థిరమైన 5 శాతం వృద్ధి కన్పిస్తోంది. గత ఏడాది ఇదే ప్రతిబింబించింది.
- కొండాపూర్, మియాపూర్, బాచుపల్లి, కొంపల్లి, కోకాపేట డిమాండ్ ఉన్న ఐదు ప్రాంతాలుగా నిలిచాయి. ఇక్కడ చదరపు అడుగు రూ.4,400 నుంచి రూ.7,100 వరకు ఉంది.
- రూ.45-75 లక్షల ధరల శ్రేణిలో ఎక్కువ ఇళ్లు అమ్ముడయ్యాయి. వీటి వాటానే 49 శాతంగా ఉంది.
- మూడు పడక గదుల ఇళ్లకు ఎక్కువమంది ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటి వాటా మొత్తం విక్రయాల్లో 52 శాతం ఉంది. రెండు పడక గదుల వాటా 39 శాతం ఉంది.
- అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 39,308గా ఉంది. గత ఏడాదితో 33,041తో పోలిస్తే పెరిగింది. మిగతా నగరాలతో చూస్తే ఇది తక్కువే.
సర్వేలో ఏం చెప్పారంటే.. (శాతాల్లో)
- 78.. వచ్చే ఏడాదిలో ఇళ్లు కొంటామన్నవారు
- 47.. ఇంటి నుంచి పని వల్ల పెద్ద ఇళ్ల వైపు చూస్తున్నవారు
- 53.. ఉన్న ఇంటిలోనే మార్పులతో సర్దుబాటు చేసుకుంటాం
- 67.. సిద్ధంగా ఉన్న ఇళ్ల వైపు చూస్తున్నవారు27.. ఉద్యోగ భద్రత వచ్చేవరకు ఒకటి రెండేళ్లు వేచి చూస్తామన్న వారు.
పదిలో దక్కని చోటు..
దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాల్లోని ప్రాంతాలకు ఉన్న డిమాండ్ ఆధారంగా మొదటి పది స్థానాలను గుర్తించగా.. ముంబయి, పుణె నగరాల్లోని ప్రాంతాలే దక్కించుకున్నాయి. పైగా ఇవన్నీ రూ.25 లక్షల నుంచి రూ.75 లక్షల ధరల శ్రేణిలో ఉన్నవే కావడం విశేషం. ఏడు ప్రాంతాల్లో రెండు పడక గదులకు డిమాండ్ ఉండగా.. మూడుచోట్ల ఒక పడక గదికే మొగ్గు చూపారు. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో హైదరాబాద్‌కు చోటు దక్కలేదు.
ఇదీ చదవండి: ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్.. పలువురు అధికారుల గైర్హాజరు