గత నెల రెండో తేదీన ప్రారంభమైన ధరణి పోర్టల్ ద్వారా మండల కేంద్రాల్లో క్రమంగా సేవలు ఊపందుకుంటున్నాయి. తమకు వ్యయప్రయాసలు తగ్గడంతో రైతులు ఊరట చెందుతున్నారు. చిక్కు పని చిటికెలో అవుతోందని సంతోషపడుతున్నారు.
141 నుంచి 570 కార్యాలయాలకు..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 141 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇన్నాళ్లూ భూముల రిజిస్ట్రేషన్లు కొనసాగేవి. దీంతో ఎంతో రద్దీ ఉండేది. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మ్యుటేషన్ల కోసం తహసీల్దారు కార్యాలయాల చుట్టూ పదేపదే తిరగాల్సి వచ్చేది. ధరణి పోర్టల్ అందుబాటులోకి రావడంతో 570 తహసీల్దారు కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు ప్రారంభమయ్యాయి. గతంలో భూ కొనుగోలుదారుడు విక్రయదారుడిని, సాక్షులను వెంటపెట్టుకుని వెళ్లడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముగించుకోవడం వ్యయప్రయాసలతో ముడిపడి ఉండేదని పేర్కొంటున్నారు. ఇప్పుడు దళారుల ప్రమేయం లేకుండానే నేరుగా తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి పని పూర్తిచేసుకోవడం ఎంతో సౌలభ్యంగా ఉందంటున్నారు.
అంతా నిమిషాల వ్యవధిలోనే...
ధరణి సేవలు పొందే క్రమంలో ప్రస్తుతం మీ సేవా కేంద్రాల్లో స్లాటు నమోదుకు కొన్ని జిల్లాల్లో జాప్యం చోటుచేసుకుంటోంది. స్టాంపు రుసుం, మ్యుటేషన్, నిర్వహణ ఛార్జీలు, చలానా, దస్త్రాల స్కానింగ్ పూర్తి చేసుకోవడానికి సమయం పడుతోంది. ఒక్కసారి ఆన్‌లైన్‌లో స్లాటు నమోదైతే ఆ తరువాత నిమిషాల వ్యవధిలో ప్రక్రియ పూర్తవుతోంది. తహసీల్దారు స్లాటు సమయాన్ని అంగీకరించి సంక్షిప్త సమాచారం పంపాక రైతులు తహసీల్దారు కార్యాలయానికి హాజరవుతున్నారు. ఆ తరువాత 20 నిమిషాల నుంచి అరగంట వ్యవధిలోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తవుతున్నాయి. భూ దస్త్రాల్లోని క్రయవిక్రయాలకు అనుగుణంగా భూ విస్తీర్ణాల్లో మార్పులు జరిగిపోతున్నాయి.
రైతులు కష్టపడకుండా సేవలు
యాజమాన్య హక్కులు పొందడానికి రైతులు కష్టపడాల్సిన అవసరం లేకుండా సేవలు అందిస్తున్నాం. మా కార్యాలయాన్ని సంప్రదించే వారికి అన్ని వివరాలు తెలియజేస్తున్నాం. ఇన్నాళ్లూ నేలకొండపల్లి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కూసుమంచి వెళ్లి రిజిస్ట్రేషన్లు చేయించుకునేవారు. ధరణి అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది రిజిస్ట్రేషన్లు, గిఫ్ట్ డీడ్‌లు చేసుకునేందుకు వస్తున్నారు.
- సుమ, నేలకొండపల్లి తహసీల్దారు, ఖమ్మం జిల్లా
కేసీఆర్‌కు కృతజ్ఞతలు
మా అమ్మానాన్నలు నాకు పసుపు కుంకుమ కింద భూమి ఇచ్చారు. అప్పట్లో దాన్ని నా పేరు మీదకు మార్చుకోలేదు. ధరణి సేవలు అందుబాటులోకి రావడంతో గిఫ్ట్ డీడ్ పూర్తిచేయించుకున్నాను. కొద్ది నిమిషాల్లోనే హక్కు పత్రాలు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
- వాకిటి విజయ, పాలకుర్తి
పసుపు కుంకుమ భూములకు రిజిస్ట్రేషన్లు
రాష్ట్రంలో పండుగలను పురస్కరించుకుని ఇంటి ఆడపడుచుకు తల్లిదండ్రులు పసుపు కుంకుమ కింద భూములు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో ఈ భూములను తెల్లకాగితాలపై ఒప్పందంగా రాసిచ్చేవారు. ఇప్పుడు ధరణి పోర్టల్‌తో మండలాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి రావడంతో తెల్లకాగితాలపై రాతకోతలు బంద్ అయ్యాయి. ఈ పోర్టల్ సేవల ద్వారా గిఫ్ట్ డీడ్ కింద ఆడపిల్లల పేర్లతో హక్కుపత్రాలను తల్లిదండ్రులు వారికి అందజేస్తున్నారు. ఇటీవల దసరా, దీపావళి సందర్భంగా రాష్ట్రంలో చాలా జిల్లాల్లో నమోదైన గిఫ్ట్ డీడ్‌లన్నీ పసుపు కుంకుమ కింద ఇచ్చే భూములే కావడం విశేషం.
- ఇదీ చూడండి:మనిషిని తొక్కిన గజరాజు- వీడియో వైరల్