Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో అనేక మౌలిక వసతుల సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. వీటి పరిష్కారం కోసం విద్యార్థులే ఏకంగా ఆందోళన బాటపడుతున్నారు. వీటి పరిష్కారానికి నిధుల కొరత ప్రధాన అడ్డంకిగా మారింది. 2014-15లో ట్రిపుల్ ఐటీకి 119.63కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం.. 71.77కోట్లు విడుదల చేసింది. ఆ తర్వాతి ఏడాది.. 2015-16లో 93.23కోట్లు కేటాయించి.. 84.92కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ రెండేళ్ల పాటు బాగానే నిధులిచ్చినా.. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి తగ్గుతూ వచ్చాయి. 2017-18 నుంచి సిబ్బంది వేతనాలకు మాత్రమే బొటాబొటీగా సర్కారు నిధులిస్తోంది.
ఏటా వర్సిటీ 120-164 కోట్ల వరకు ప్రతిపాదనలు సమర్పిస్తున్నా అందులో నాలుగో వంతు మాత్రమే బడ్జెట్‌లో కేటాయిస్తోంది. విడుదల సమయానికి ఆ మొత్తంలో కూడా కోత పడుతోంది. 2014-15 నుంచి ప్రస్తుత బడ్జెట్ వరకు 430.51 కోట్లు కేటాయించినా విడుదల చేసింది మాత్రం రూ.294.14 కోట్లే. ఈ ఆర్థిక సంవత్సరం, కరోనా కారణంగా మూతపడిన 2020-21, 2021-22 విద్యా సంవత్సరాలను మినహాయించి 2019-20 వరకు చూసినా బడ్జెట్‌లో కేటాయించిన నిధులను ఇవ్వలేదు. విద్యార్థులు ఆందోళనకు దిగిన తర్వాత ఇప్పటివరకు 16 కోట్లు విడుదల చేసినట్లు వర్సిటీ అధికారులు ప్రకటించారు.
గతంలో బాసర ట్రిపుల్ ఐటీ వద్ద 170 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉండేవి. ప్రభుత్వం తగినంత బడ్జెట్ ఇవ్వకపోవడంతో వాటిని విత్ డ్రా చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు 120 కోట్లు డ్రా చేసి వివిధ అవసరాలకు ఖర్చు చేశారు. ఇక 50 కోట్లే ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. నిధుల కొరత కారణంగా శౌచాలయాలు, బెడ్ల నిర్వహణ లాంటి చిన్న చిన్న పనులను కూడా పట్టించుకోవడంలేదు. ఇక అతిథి గృహాల నిర్మాణం కూడా ఆగిపోయింది. ప్రతి నెలా వేతనాలకు 2కోట్ల 50లక్షలు ఖర్చవుతాయి. అంటే ఏడాదికి 30 కోట్లు అవసరం. అంత మొత్తం కూడా విడుదల కావడం లేదు. సిబ్బంది క్వార్టర్లు, కొన్ని ల్యాబ్ భవనాలు, డ్రైనేజీ, క్రీడా మైదానం, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. బాలుర హాస్టల్ భవనం కూడా ఆగిపోయింది. ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థుల ఆందోళనలు మరింత తీవ్రతరం కాకముందే.... విద్యాసంస్థలోని సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలని విద్యావేత్తలు కోరుతున్నారు.
ఇవీ చూడండి