కేంద్ర గెజిట్‌పై సెప్టెంబర్ 1న కృష్ణా, గోదావరి బోర్డులు భేటీ కానున్నాయి. సెప్టెంబర్ 1న ఉదయం కృష్ణా బోర్డు సమావేశం జరగనుండగా.. సాయంత్రం 4 గంటలకు రెండు బోర్డులు సంయుక్తంగా తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశం జరగనుంది.
భేటీకి హాజరుకావాలని సీఎం నిర్ణయం..
మరోవైపు వచ్చే నెల ఒకటో తేదీన జరగబోయే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశానికి హాజరు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యంత్రాంగాన్ని ఆదేశించారు. అందులో కృష్ణాజలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం బలమైన వాదనలు వినిపించాలని ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులకు సూచించారు. కేఆర్‌ఎంబీ సమావేశం ఎజెండా అంశాలపై బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా బోర్డు భేటీలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. 'కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటా కోసం కృష్ణాబోర్డుతో పాటు ట్రైబ్యునళ్లు సహా అన్ని రకాల వేదికల మీద బలమైన వాదనలు వినిపించాలి. 1న జరిగే సమావేశానికి సాధికారిక సమాచారంతో హాజరై, సమర్థవంతంగా మాట్లాడాలి' అని తెలంగాణ సీఎం సూచించారు.
ఇదీ చదవండి: krishna water: మాకు 70.. వారికి 30 నిష్పత్తిలో పంచండి.. కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు ఏపీ లేఖ