కృష్ణా జలాల్లో మార్చి నెలాఖరు వరకు తెలంగాణకు 82 టీఎంసీలు.. ఏపీకి 95 టీఎంసీలు కేటాయించేందుకు కృష్ణాబోర్డు ప్రాథమికంగా అంగీకరించింది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో బోర్డు సభ్య కార్యదర్శి రాయ్‌పురే, తెలంగాణ తరఫున నాగార్జునసాగర్ ముఖ్య ఇంజినీరు నరసింహ, ఏపీ ఇంజినీర్ ఇన్‌చీఫ్ నారాయణరెడ్డి దీనిపై చర్చించారు. ఇప్పటికే తెలంగాణ 82 టీఎంసీలు అవసరమని, ఏపీ 108 టీఎంసీలు కేటాయించాలని ప్రతిపాదనలను సమర్పించాయి. శ్రీశైలం జలాశయంలో 810 అడుగులు, నాగార్జునసాగర్‌లో 520 అడుగులకు దిగువ నుంచి నీటిని తీసుకోవద్దని తెలంగాణ కోరింది. దీంతో జలాశయాల మట్టాలకు అనుగుణంగా ఏపీ నీటి కేటాయింపుల విజ్ఞప్తిని సవరించుకోవాలని, 95 టీఎంసీల లోపు ప్రతిపాదనలు సమర్పించాలని బోర్డు సూచించింది.
విశాఖకే కృష్ణా బోర్డు
తెలంగాణలో గోదావరి యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) ఆ నదీ పరీవాహకంలో లేదని, అలాంటప్పుడు కృష్ణా బేసిన్‌లో లేని విశాఖపట్నంలో కృష్ణా బోర్డు కార్యాలయం ఉంటే ఏమవుతుందని ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి అన్నారు. బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బోర్డు విశాఖకు తరలించడం ఖాయమన్నారు. విభజన చట్టం ప్రకారం బోర్డును ఏపీలో ఏర్పాటు చేయాల్సి ఉంది. అధికారులు విశాఖలో అధ్యయనం చేసినట్లు సమాచారం.
ఇదీ చదవండి