వైరస్ అనుమానిత లక్షణాలు కనిపించిన వారు వైద్య సేవలను పొందడంలో చేస్తున్న జాప్యం చివరకు ప్రాణాలను బలి తీసుకుంటోంది. ప్రమాద తీవ్రతను ఊహించలేకపోవడం, సొంత వైద్యం చేసుకోవడం విషమ పరిస్థితులకు కారణమవుతున్నాయి. చివరి దశలో ఆసుపత్రులను ఆశ్రయించడం వల్ల ఫలితం దక్కడం లేదు. కొవిడ్ ఆసుపత్రుల్లో మృతి చెందిన వారి ఆరోగ్య వివరాలను వైద్య ఆరోగ్య శాఖ విశ్లేషించినప్పుడు.. ఈ విషయం స్పష్టమైంది. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నవారికి కనీసం ఆరేడు రోజులపాటు చికిత్సనందిస్తేనే ఫలితం కనిపిస్తుందని వైద్యాధికారులు చెబుతున్నారు. ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఇచ్చే మందులు పనిచేయాలంటే తగిన సమయం అవసరమని పేర్కొంటున్నారు.
51% మరణాలు 3 రోజుల్లోపే..
కొవిడ్ ఆసుపత్రుల్లో చేరి చనిపోయిన వారి ఆరోగ్య చరిత్రను వైద్య ఆరోగ్య శాఖ విశ్లేషిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 4 వేల200 మంది కరోనాతో మృతి చెందారు. దీర్ఘకాలిక వ్యాధులున్నవారే వీరిలో ఎక్కువ. 3 వేల 112 మంది మరణాలను పరిశీలించినప్పుడు 12% మంది ఆసుపత్రుల్లో చేరిన గంటల్లోనే ప్రాణాలు విడిచారు. మూడు రోజుల్లోగా ప్రాణాలు కోల్పోయినవారు 51% మంది ఉన్నారు. 17% మంది 4 నుంచి 6 రోజులు, మిగిలినవారు వారానికిపైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఇదీ చదవండి: ప్లీజ్... మా నాన్నను కాపాడండి: మహిళా వాలంటీర్ అభ్యర్థన