జి.కొండూరు మండలంలో కడెంపోతవరం, లోయ గ్రామాల పరిధిలో దాదాపు 500 ఎకరాల్లో గ్రావెల్, కంకర తవ్వేశారు. గతంలో 11 మందికి ఇక్కడ లీజులు ఇచ్చినా, వాటిని తర్వాత రద్దుచేశారు. దాంతో లీజులు లేకుండానే తవ్వకాలు సాగాయి. కడెంపోతవరంలో ఇటీవల 250 ఎకరాలకు సర్వే నెంబరు 143 సృష్టించి, లీజులకు అనుమతులు ఇచ్చారు. మరో సర్వేనెంబరు 26/1లో 280 ఎకరాలు ఉంది. ఇది వర్గీకరణ ప్రకారం అడవి అయినా, రెవెన్యూశాఖ ఎన్‌వోసీ జారీచేసింది. గతంలో ఇక్కడ లీజులిస్తే కృష్ణాజిల్లా సంయుక్త కలెక్టర్ తనిఖీచేసి రద్దుచేశారు. గత ఏడాది కాలంగా రూ.100 కోట్లకు పైగా విలువైన కంకర, గ్రావెల్ తరలించినట్లు అంచనా. ప్రస్తుతం అటవీశాఖ అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ పనిచేసే యంత్రాలను, టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతం ఎవరిదో తేల్చేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేశారు.
ఇదీ పరిస్థితి
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం, జి.కొండూరు మండలాల పరిధిలో కొండపల్లి రిజర్వు ఫారెస్టు ఉంది. 1891లోనే దీన్ని నోటిఫై చేశారు. 1933లో రీసెటిల్మెంటు జరిగినప్పుడు అప్పటివరకు సర్వే చేయని అడవులనూ రిజర్వు ఫారెస్టులో కలిపారు. కడెంపోతులూరు, లోమ గ్రామాల పరిధిలో సర్వే జరగని 250 ఎకరాల భూమి మిగిలిపోయింది. దీనికి 143, 26/1 సర్వే నెంబరు ఇచ్చి రెవెన్యూ భూమిగా మార్చారు. ఇక్కడ కొన్నేళ్లుగా తవ్వకాలు జరిగినా ఎవరూ పట్టించుకోలేదు. 2009లో అటవీశాఖ ఈ భూమి తమదని చెప్పింది.
తర్వాత కొందరికి రెవెన్యూ అధికారులు ఎన్‌ఓసీలు ఇవ్వగా, గనులశాఖ అనుమతులు ఇచ్చింది. దాంతో కంకర తవ్వకాలు జరిగాయి. త్రిసభ్య కమిటీలు ఏర్పాటైనా.. నివేదికలు రాలేదు. 2017లో కృష్ణాజిల్లా సంయుక్త కలెక్టర్ విజయకృష్ణన్ ఆ ప్రాంతాన్ని అటవీభూమిగా నిర్ధారించి, లీజులు రద్దుచేశారు. ఆమె ఉత్తర్వులను ఉన్నతాధికారులు ఆపారు. తర్వాత అటవీశాఖ కోర్టుకు వెళ్లగా అనుకూలంగా తీర్పు వచ్చింది. నాటి నుంచి కొత్తగా గనుల శాఖ అనుమతులు ఇవ్వలేదు. అక్రమ తవ్వకాలు పెరగడంతో అటవీశాఖ అధికారులు ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు.
అందరిపై చర్యలు తీసుకుంటాం
ఆ ప్రాంతం రిజర్వు ఫారెస్టు. గత కొంతకాలంగా అక్రమ తవ్వకాలు జరిగాయి. ఒక డీఆర్‌ఓ, గార్డును సస్పెండ్ చేశాం. నేను ఇటీవల బాధ్యతలు తీసుకున్నాను. 2014 నుంచి తవ్వకాలు జరిగాయి. విచారణ జరిపి అందరిపై చర్యలు తీసుకుంటాం.
- మంగమ్మ, జిల్లా అటవీ అధికారి
విచారణ జరుగుతోంది
రెండుశాఖల మధ్య వివాదం ఉన్నమాట వాస్తవమే. దీనిపై సంయుక్త తనిఖీ చేస్తున్నాం. సరిహద్దులు, వర్గీకరణ నిర్ణయించాలి. త్రిసభ్యకమిటీ నివేదికను బట్టి కలెక్టరు చర్యలు తీసుకుంటారు. రికార్డులను పరిశీలిస్తున్నాం.
- కె.మాధవీలత, సంయుక్త కలెక్టర్