children protest against street dogs problem : కేటీఆర్ అంకుల్... ఎమ్మెల్యే అంకుల్... కమిషనర్ అంకుల్.. ప్లీజ్ మమ్మల్ని కాపాడండి అంటూ తెలంగాణలో చిన్నారులు రోడ్డెక్కారు. వీధి కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని... విజ్ఞప్తి చేశారు. మేడ్చల్ జిల్లా కొంపల్లి మున్సిపల్ పరిధిలోని ఎన్సీఎల్ నార్త్ రెవెన్యూ కాలనీలో చాలా రోజుల నుంచి వీధికుక్కల బెడద వేధిస్తోంది. అక్కడి పిల్లలు, వృద్ధులు వీధి కుక్కల కాటుకు గురవుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్యను పరిష్కరించకపోవడంతో... కాలనీలోని చిన్న పిల్లలు ఆందోళన చేపట్టారు.
సమస్య పరిష్కారం కోసం విజ్ఞప్తి
save from street dogs : పిల్లలు.. తల్లిదండ్రులతో కలిసి అధికారులను వేడుకుంటున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ... జాతీయ రహదారిపైకి వచ్చి నిరసన తెలిపారు. ఏడాదిలో సుమారు వంద మందికి పైగా తమ కాలనీకి చెందిన పిల్లలు, వృద్ధులు వీధి కుక్కల కాటుకు గురయ్యారని తెలిపారు. కొంతమంది పిల్లలకు సర్జరీలు సైతం అయ్యాయని... అయినా సమస్యను మాత్రం పరిష్కరించట్లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని వేడుకుంటున్నారు.
ఈ ఏడాదిలో 20 మంది పెద్దవాళ్లు, 80 మంది పిల్లలు కుక్క కాటుకు గురయ్యారు. కరోనా వ్యాక్సిన్ తగ్గి.. కుక్కల వ్యాక్సిన్‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తోంది. మా పిల్లలను రక్షించండి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నాం. అందుకే పిల్లలకు పరీక్షలు ఉన్నా కూడా ఈ ఆందోళన చేపట్టాం.
-కాలనీవాసులు
ఒకరోజు సైకిల్ తొక్కుతుంటే... కుక్కలు మమ్మల్ని చుట్టుముట్టాయి. 20 కుక్కలు మాపై దాడి చేశాయి. గాయపడిన మేం ఇంటికి వెళ్తుంటే.. వేరే కుక్కలు కూడా దాడి చేశాయి. తర్వాత ఆస్పత్రికి వెళ్లాం. సర్జరీ చేశారు.
-ప్రణీత్ రెడ్డి, చిన్నారి
నేను, మా చెల్లి ఆడుకోవడానికి పార్క్‌కు వెళ్తుంటే కుక్కలు దాడి చేశాయి. గాయపడిన తర్వాత మేం ఇంటికి వెళ్తున్నాం. మధ్యలో చాలా కుక్కలు మా వెంటపడ్డాయి. ఆస్పత్రికి వెళ్లి ఇంజెక్షన్లు తీసుకున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది.
-చిన్నారి, కాలనీవాసి
ఇదీ చదవండి: scholarships: విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న వారికి ఉపకార వేతనాలు ఎప్పుడు..?